వికలాంగుల బోగీల్లో ప్రయాణించే పోలీసులపై కఠిన చర్యలు: గవర్నర్ | should take action on who police travel in disabled person coach | Sakshi
Sakshi News home page

వికలాంగుల బోగీల్లో ప్రయాణించే పోలీసులపై కఠిన చర్యలు: గవర్నర్

May 9 2014 11:21 PM | Updated on Sep 2 2017 7:08 AM

లోకల్ రైళ్లలో వికలాంగుల కోసం కేటాయించిన బోగీలలో రైల్వే పోలీసులు ప్రయాణించవద్దని గవర్నర్ శంకర్ నారాయణన్ హెచ్చరికలు జారీ చేశారు.

సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో వికలాంగుల కోసం కేటాయించిన బోగీలలో రైల్వే పోలీసులు ప్రయాణించవద్దని గవర్నర్ శంకర్ నారాయణన్ హెచ్చరికలు జారీ చేశారు. వికలాంగులు, క్యాన్సర్ రోగులకు కేటాయించిన బోగీలలో ప్రయాణించిన పోలీసులపై ఇకమీదట కఠిన చర్యలు తీసుకోనున్నారు. వికలాంగుల బోగీలలో ప్రయాణించడాన్ని నిషేధించినప్పటికీ వారు పలు మార్లు పట్టుబడినట్లయితే అరెస్టు చేయడానికి కూడా వెనుకాడమన్నారు. 2013 ఆగస్టు 27వ తేదీన ఈ అంశాన్ని సామాజిక సంక్షేమ శాఖ మంత్రితో కూడా చర్చించామని, తర్వాతే తీర్మానించామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

సామాజిక కార్యకర్త నితిన్ గైక్వాడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఈ విషయమై తాను పోరాటం చేస్తున్నానన్నారు. అయినప్పటికీ పోలీసు శాఖ ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. తాను ఇటీవల ప్రత్యక్షంగా చూసిన ఓ సంఘటనను వివరించారు. ఇటీవల ఓ ప్రయాణికుడు వికలాంగులకు కేటాయించిన బోగీలో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసు కూడా ఉన్నాడనీ, అయితే పోలీసుపై ఎలాంటి చర్య తీసుకోకుండా మరో ప్రయాణికుడిని అరెస్టు చేశారని గైక్వాడ్ పేర్కొన్నారు. 2013 నవంబర్‌లో పుణే కోర్టు కూడా వికలాంగులకు సంబంధించిన అంశంపై నిఘా ఉంచాల్సిందిగా అప్పటి కమిషనర్ సత్యపాల్ సింగ్‌ను ఆదేశించింది. దీంతో వికలాంగుల బోగీలలో ప్రయాణించవద్దని సింగ్ పోలీసులను ఆదేశించారు.

 రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లు పోగొట్టుకున్న మరో కార్యకర్త సమీర్ జావేరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ... వికలాంగులకు కేటాచించిన బోగీలలో ప్రయాణించిన వారిని ఇండియన్ రైల్వే చట్టం, 155 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జరిమానా కూడా విధించడం ద్వారానే పోలీసులు ఈ బోగీలలో ప్రయాణించడాన్ని మానుకుంటారని, దీనికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. అయితే జనరల్ బోగీలలో ప్రయాణించడం పోలీసులకు కష్టంగా మారడంతో వికలాంగుల బోగీలను ఎంచుకుంటున్నారని, దీంతో వికలాంగులకు కష్టమవుతోందని చెప్పారు.

 ఇదిలావుండగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(జీఆర్పీ) దీపక్ దేవ్‌రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనిఖీల నిమిత్తమే పోలీసులు రిజర్వ్ చేసిన బోగీలలో ఎక్కుంతుంటారని, కానీ సౌకర్యంగా ఉంటుందనే పోలీసులు ఈ బోగీలలో ప్రయాణిస్తున్నారని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నారన్నారు. అయితే తాను ఇప్పటి వరకు గవర్నర్ నోటీసు చదవలేదని, తనకు  ఈ విషయమై ఎలాంటి అవగాహన లేదని, దీనిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయదల్చుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement