పుణేలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రాహుల్‌గాంధీ సమావేశం | Rahul gandhi meets party workers in pune ahead of 2014 elections | Sakshi
Sakshi News home page

పుణేలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రాహుల్‌గాంధీ సమావేశం

Sep 26 2013 2:18 AM | Updated on Mar 18 2019 9:02 PM

వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు ఇప్పటినుంచే నడుం బిగించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, పదాధికారులకు సూచించారు.

పింప్రి, న్యూస్‌లైన్: వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు ఇప్పటినుంచే నడుం బిగించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, పదాధికారులకు సూచించారు. ఇందుకోసం విభేదాలను విడనాడి ఒకేతాటికిపైకి రావాలని పిలుపునిచ్చారు. రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం విదర్భలో పర్యటించిన రాహుల్ రాత్రి 8.50 గంటలకు ప్రత్యేక విమానంలో పుణేలోని లోహగావ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బాలేవాడిలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిం చారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తమ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో ముందున్నాయన్నారు.
 
 ఈ సమావేశానికి పింప్రి-చించ్‌వడ్ నగర శాఖ అధ్యక్షుడు భావ్‌సాహెబ్ బోయిర్, దేవీదాస్ బాన్సోడే,  మహిళా విభాగం నగర శాఖ అధ్యక్షురాలు జ్యోతి భారతి, మాజీ ప్రతిపక్ష నాయకుడు కైలాస్ కదం, మాజీ మేయర్ హనుమంత భోస్లే, మాజీ కార్పొరేటర్లు బాబూనాయిక్, ప్రాంతీయ సభ్యులు. కార్యకర్తలు, స్థానిక పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  నగర అధ్యక్షుడు భావ్‌సాహెబ్ బోయిర్ రాహుల్‌తో మాట్లాడుతూ స్థానిక ంగా పార్టీని బలోపేతం చేయడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారని ఫిర్యాదు చేశారు. ఇందువల్ల మిత్రపక్షమైన ఎన్సీపీ లబ్ధి పొందుతోందని, వివిధ ఎన్నికల్లో ఆ పార్టీని విజయం వరిస్తోందంటూ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, మహిళ, వితంతువుల పింఛన్లు అర్హులైన వారికి అందడం లేదని, అందువల్ల పార్టీ కార్యకర్తలు అసంతృప్తికి గురవుతున్నారని, వారు పార్టీకి దూరమయ్యే ప్రమాదముందని రాహుల్‌కు విన్నవించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుని నష్టనివారణకు చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం బాబూనాయిక్... రాహుల్‌తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పని తీరు ఎంతో బాగుందంటూ కితాబిచ్చారు.
 
 వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు స్థానిక కార్యకర్తలను, పదాధికారులను జాగృతం చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. పార్టీని బలోపేతం చేసేందుకు వారు కృషి చేసే విధంగా చూడాలని విన్నవించారు. పార్టీ బలోపేతమైతే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం సునాయా సమవుతుందని తెలిపారు. కార్యకర్తలు, పదాధికారుల ఫిర్యాదులు, విన్నపాలను ఓపిగ్గా విన్న రాహుల్....అందరితో చర్చలు జరిపారు. కాగా తమ నాయకుడు సురేశ్ కల్మాడీపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ఆయన మద్దతుదారులు రాహుల్‌గాంధీకి ఓ వినతిపత్రం ఇచ్చినట్టు తెలియవచ్చింది. అయితే అదేమీ లేదంటూ ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తులేకుండా  ఒంటరిగా బరిలోకి దిగాలని పలువురు నాయకులు కోరగా పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చేవిధంగా కృషి చేయాలని రాహుల్ సూచిం చారు. కాగా రాహుల్ వెంట సీఎం పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మోహన్ ప్రకాశ్ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement