
ఐక్యతతోనే గెలుపు
రాజకీయ పార్టీ ఒక కుటుంబం వంటిది.
► కాంగ్రెస్ భేటీలో రాహుల్‌గాంధీ
సాక్షి, బెంగళూరు: ‘రాజకీయ పార్టీ ఒక కుటుంబం వంటిది. కుటుంబంలోని సభ్యులందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అయితే సభ్యులందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటేనే మనుగడ సాధ్యం. పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు నడిపించాలి. అప్పుడే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తాం.’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో జరిగిన ఎంపిక చేసిన 1,500 మంది కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
పార్టీలో ఉన్న అనైక్యతను తొలగించడానికి కొత్త ఇన్‌చార్జ్‌గా వేణుగోపాల్‌ను నియమించానని, ఆయన ప్రయత్నం తనకు సంతృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీల నుంచి ప్రభుత్వానికి మంచి మద్దతు లభిస్తోందని, ఇందుకు సిద్ధరామయ్య అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. ఆయనకు మీ (ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు) నుంచి సంపూర్ణ సహకారం లభిస్తే రానున్న ఎన్నికల్లో మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ప్రజల మద్దతు ఉన్న నాయకులకు మాత్రమే టికెట్లు దక్కుతాయన్నారు. ధన బలం ఉన్నవారు ఎంత ప్రయత్నించినా ఈసారి టికెట్లు ఇవ్వబోమన్నారు. ఎన్నికల్లో పోటీచేసి గెలవడానికే వచ్చేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇవ్వబోమన్నారు. మొదటి నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేసేవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు సామూహిక నాయకత్వంలో వెళ్తామని చెప్పారు.