ఆలస్యం కానున్న ‘ఎక్స్‌ప్రెస్‌వే’ | Potential delay 'Expressway' | Sakshi
Sakshi News home page

ఆలస్యం కానున్న ‘ఎక్స్‌ప్రెస్‌వే’

Sep 25 2013 2:19 AM | Updated on Sep 1 2017 11:00 PM

భూసేకరణలో ఆలస్యం వల్ల ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు పనుల ప్రారంభంలో మరింత జాప్యం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ: భూసేకరణలో ఆలస్యం వల్ల ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు పనుల ప్రారంభంలో మరింత జాప్యం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనీపేట్, ఘజియాబాద్, పాల్వాల్‌ను కలుపుతూ 135 కి.మీ. పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే పనులు డిసెంబర్ చివరివరకు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ తూర్పు ప్రాంత ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ)కు నాలుగు కోట్ల క్యూబిక్ మీటర్ల భూమి అవసరం. కాగా, ఇంత పరిమాణంలో భూమి ఇక్కడ లభించడం దుర్లభం. ఎఫ్‌ఐసీసీఐ అవగాహన సమావేశంలో రహదారుల శాఖ కార్యదర్శి విజయ్ చిబ్బర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక అంచనాలు జరిపినప్పుడు భూ సేకరణ విషయమై తగిన అవగాహన లేదని తెలిపారు. 
 
 అన్ని ఇబ్బందులను అధిగమించి ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరకు గాని, వచ్చే ఏడాది ప్రారంభంలోగాని మొదలుపెడతామని చిబ్బర్ తెలిపారు. ఈ 135 కి.మీ. ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల ఘజియాబాద్-ఫరీదాబాద్ మధ్య, గౌతమ్ బుద్ధ్ నగర్- పాల్వాల్ మధ్య సిగ్నల్ రహిత రహదారి సౌకర్యం ఏర్పడుతుందని వారు తెలిపారు. 
 
 ఢిల్లీ-మీరట్ (66 కి.మీ.), ముంబై-వడోదరా(400 కి.మీ.) మధ్య కూడా ఇదే ఆర్థిక సంవత్సరంలో మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రహదారుల మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు ఛిబ్బర్ వివరించారు. ఇదిలా ఉండగా గత ఏడాది 9,500 కి.మీ. పొడవైన రోడ్ల పనులను ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 1,933 కి.మీ. మేర పనులనే చేపట్టినట్లు ఆయన తెలిపారు. భూ సేకరణలో ఇబ్బందులవల్లే ప్రాజెక్టుల ప్రారంభం, పూర్తిచేయడం ఆలస్యమవుతున్నాయని చబ్బర్ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement