తిరువణ్ణామలై సమీపంలో రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లంబర్‌ను కిడ్నాప్ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్లంబర్ కిడ్నాప్ : ఐదుగురి అరెస్టు
Aug 13 2013 5:12 AM | Updated on Sep 1 2017 9:48 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : తిరువణ్ణామలై సమీపంలో రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లంబర్‌ను కిడ్నాప్ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువణ్ణామలై, కొలక్కారవాడి గ్రామానికి చెందిన రౌద్రి అలియాస్ మురుగన్ (35) ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్‌లో నరిపల్లి పెరియపట్టి రోడ్డులో హొగ్నెకల్ సహకార తాగునీటి పథకంలో పైప్‌లైన్ అమర్చేందుకు తన ఊరికి చెందిన కొందరిని పనికి తీసుకెళ్లాడు.
అక్కడ వారికి కాంట్రాక్టర్ తగిన జీతం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం చెందిన రౌద్రి అలియాస్ మురుగన్ తిరువణ్ణామలైకు చెందిన వీరరాఘవన్ (39) అనే వ్యక్తి వద్ద లారీని అద్దెకు తీసుకుని రూ.2.45 లక్షల విలువైన పైపులను చోరీ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. లారీని స్వాధీనం చేసుకుని అరూర్ కోర్టులో అప్పగించారు. లారీని కోర్టు నుంచి విడిపించడానికి వీరరాఘవన్ రూ.లక్ష చెల్లించాడు. ఈ మొత్తాన్ని ఇవ్వాలని రౌద్రిని అడిగాడు. తాను అంత మొత్తాన్ని ఇవ్వలేనని, రూ.40 వేలు మాత్ర ఇస్తానని పేర్కొన్నాడు. అది కూడా ఇవ్వలేకపోయాడు.
దీంతో ఆగ్రహం చెందిన వీరరాఘవన్ తన సహచరులు వెంకటేశన్ (33), శివకుమార్ (30), రాజి (32), మురుగన్(29)తో కలిసి శనివారం రౌద్రిని కారులో కిడ్నాప్ చేశాడు. అతని నుంచి తప్పించుకున్న రౌద్రి శనివారం రాత్రి ఇంటికి చేరుకుని తిరువణ్ణామలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం వీరరాఘవన్‌తోపాటు ఐదుగురిని అరెస్టు చేసి కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు, కత్తి, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement