ఎట్టకేలకు పేడర్ రోడ్ వంతెనకు మార్గం సగమమైంది. వివిధ కారణాల వల్ల గత పదేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సాక్షి, ముంబై: ఎట్టకేలకు పేడర్ రోడ్ వంతెనకు మార్గం సగమమైంది. వివిధ కారణాల వల్ల గత పదేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్డీసీ) అంటున్నారు. దక్షిణ ముంబైలో ఎదురవుతున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించాలంటే ఇరుకుగా ఉన్న పేడర్ రోడ్‌ను విస్తరించాలి.
కానీ అది సాధ్యమయ్యే పనికాకపోవడంతో ఫ్లై ఓవర్ అంశం తెరమీదకు వచ్చింది. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇక్కడ వంతెన నిర్మించడాన్ని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కుటుంబం, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గత పదేళ్లుగా ఈ ప్రాజెక్టు పెండింగులో పడిపోయింది. వారిని నచ్చజెప్పేందుకు స్థానిక రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఎంఎస్‌ఆర్డీసీ జోక్యం చేసుకుని స్థానికులతో ప్రజా దర్భార్ ఏర్పాటుచేసి వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసింది. స్థానికులు వెల్లడించిన అభిప్రాయాలకనుగుణంగా ఈ ప్రాజెక్టు ప్రణాళికలో అనేక మార్పులు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ సూచించింది. దీని ప్రకారం చర్నిరోడ్ సముద్ర తీరానికి సమీపంలో వంతెనకు నాలుగు పిల్లర్లు వేయాలి. దీనికి సీఆర్‌జెడ్ అడ్డురావడంతో పర్యావరణ శాఖ అభ్యంతరంతెలిపింది. దీంతో రెండు పిల్లర్లకు కుదించారు.
దీంతో పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే అధికారులు సమావేశమై టెండర్ల ప్రక్రియకు తుది మెరుగులు దిద్దనున్నారు. ఇక ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయని ఎంఎస్‌ఆర్డీసీ వర్గాలు తెలిపాయి. ‘ఈ ప్రాజెక్టులో భాగంగా పేడర్ రోడ్‌పై హాజీఅలీ జంక్షన్ నుంచి విల్సన్ కాలేజీ వరకు 3.9 కి.మీ. ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. ప్రస్తుతం ట్రాఫిక్‌లో ఈ దూరాన్ని చేధించాలంటే కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం తీసుకుంటోంది. ఫ్లై ఓవర్ వినియోగంలోకి వస్తే కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చ’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. సాధారణ ప్రజలతోపాటు మంత్రులు, వీఐపీలు, ఇతర రంగాల ప్రముఖుల వాహనాల ఇంధనంతోపాటు విలువైన సమయం ఆదా అవుతుందన్నారు.