మద్యానికి ‘కరువు’ లేదు | no shortage for "liquor" | Sakshi
Sakshi News home page

మద్యానికి ‘కరువు’ లేదు

Aug 5 2013 12:31 AM | Updated on Sep 1 2017 9:38 PM

రాష్ట్రంలో గత ఏడాది కరువు రావడంతో తాగేందుకు కూడా నీరు లేక ప్రజలు విలవిల్లాడిపోయారు. గత్యంతరం లేక కొందరు వలసపోయారు

 సాక్షి, ముంబై: రాష్ట్రంలో గత ఏడాది కరువు రావడంతో తాగేందుకు కూడా నీరు లేక ప్రజలు విలవిల్లాడిపోయారు. గత్యంతరం లేక కొందరు వలసపోయారు. ఇదేకాలంలో మద్యం అమ్మకాలు మాత్రం రికార్డుస్థాయిలో జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు ఏకంగా 80.53 కోట్ల లీటర్ల మద్యం స్వాహా చేసినట్లు ఎక్సైజ్‌శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఆదాయం పెంచేందుకు మద్యం విక్రయాలు పెంచాలని ప్రభుత్వం స్వయం గా అధికారులను పురమాయిస్తోంది. దీంతో మద్యం విక్రయాలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మించిపోయాయి. మద్యం విక్రయాలు ఏటా 8 నుంచి 10 శాతం పెరగడం గమనార్హం. ఒకపక్క రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కరువు, మరోపక్క మద్యం ఏరులైపారుతున్నట్లు తెలుస్తోంది. 2013లో ముగి సిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 33.83 కోట్ల లీటర్ల దేశీయ తయారీ మద్యం, 31.70 కోట్ల లీటర్ల బీరు, 15 కోట్ల లీటర్ల విదేశీ మద్యం అమ్ముడయిం ది. ఇదిలాఉండగా ముంబై, ఠాణే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ఇలా ఐదు జిల్లాల్లో 2011-12లో 26.74 కోట్ల లీటర్ల మద్యం విక్రయమయింది. అదే 2012-13లో ఏకంగా 2.25 కోట్ల లీటర్లు పెరిగింది.
 
  మద్యం ధరలు గత మూడేళ్లతో పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయి. దీన్నిబట్టి మద్యం విక్రయాలు తగ్గిపోవాల్సి ఉండగా, పరిస్థితి అందు కు భిన్నంగా ఉంది. ప్రతిరోజూ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడేళ్లలో బీరు సేవిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. బీర్ల విక్రయా లు 12 శాతం పెరగగా, విదేశీ మద్యం 5.48 శాతం, దేశీయ మద్యం అమ్మకాలు 2.61 శాతం పెరిగాయి. వైన్ విక్రయాలు 31.27 లక్షల లీటర్లు ఉండగా, ఈ విభాగంలోనూ 14 శాతం విక్రయాలు పెరిగాయి. 2008-09లో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.4, 436 కోట్ల ఆదాయం వచ్చింది. నాలుగేళ్లలో ఈ ఆదాయం రెట్టింపయింది. మద్యం విక్రయాల ద్వారా గతేడాది ప్రభుత్వానికి సుమారు రూ.9,460 కోట్ల రాబడి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే సంవత్సరం రూ.10,535 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ర్ట ప్రభు త్వ ఖజానాలోకి అత్యధిక ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే సమకూరుతోంది. అందుకే మద్యం రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరించవద్దని పోలీసులకు ప్రభుత్వం పరోక్షంగా సూచిం చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement