నిర్మలాదేవికి బెయిల్‌

Nirmala Devi Get Bailed in Students Case - Sakshi

11 నెలల తర్వాత బయటకు

బెయిల్‌ వచ్చిన వారం రోజులకు జనంలోకి

గవర్నర్‌ ఎక్కడ.. న్యాయవాది ఫైర్‌

పొల్లాచ్చి కనిపించ లేదా అని ప్రశ్న

రాజకీయకారణాలతోనేకటకటాల్లో

సాక్షి, చెన్నై: ప్రొఫెసర్‌ నిర్మలాదేవి ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు. 11 నెలల అనంతరం ఆమె జైలు జీవితాన్ని విడి జనంలోకి వచ్చారు. రాజకీయ కారణాలతోనే ఇన్నాళ్లు జైల్లో నిర్మలాదేవి మగ్గాల్సి వచ్చిందని, గవర్నర్‌ ఎక్కడ, ఢిల్లీనా...గిండినా అంటూ ఆమె తరఫు న్యాయవాది పసుం పొన్‌ పాండి ప్రశ్నించారు. వందలాది మంది యువతులతో చెలాగాటం ఆడిన పొల్లాచ్చి వ్యవహారం గవర్నర్‌కు కనిపించనట్టుందని మండిపడ్డారు. మాయమాటలతో నలుగురు విద్యార్థినులను తప్పుడు మార్గంలో పయనింపచేసే ప్రయత్నంలో అరుప్పుకోట్టై ప్రొఫెసర్‌ నిర్మలాదేవి అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ నలుగురు విద్యార్థినులను ఎవరి కోసమో లొంగదీసుకుని  ఉచ్చులో దించే ప్రయత్నాన్ని ఆమె చేసినట్టుగా ఆడియో బయటకు రావడం చర్చకు దారి తీసింది. ఈ కేసులో నిర్మలాదేవితో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి అరెస్టు అయ్యారు. విచారణ శరవేగంగా సాగడం అనేక అనుమానాలు, ఆరోపణలకు సైతం దారి తీశాయి.

ప్రధానంగా గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఈ వ్యవహారంపై వ్యాఖ్యలు చేయడం, ఆ తదుపరి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించడం వంటి పరిణామాలు దుమారాన్ని రేపాయి. అదే సమయంలో నిందితులకు బెయిల్‌ కూడారానివ్వకుండా ప్రయత్నాలు సాగడంతో తెర వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.  అలాగే, కేసు సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరడం, ఆగమేఘాలపై చార్జ్‌షీట్‌లు దాఖలు కావడం వంటి పరిణామాలు అనుమానాలకు బలాన్ని చేకూర్చే పరిస్థితుల్ని కల్పించాయి. నిందితులు పలుమార్లు బెయిల్‌ ప్రయత్నాలు చేసినా, ఫలితం శూన్యం. ఎట్టకేలకు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించి మురుగన్, కరుప్పు బయటకు వచ్చారు. అయితే, నిర్మలాదేవి జైలుకే పరిమితం అయ్యారు.  ఈ సమయంలో ఆమె మీడియా వద్దకు పరుగులు తీసి ఏదో చెప్పాలని ప్రయత్నించడం, అలాగే, ఆమె తరఫు న్యాయవాది తీవ్రంగా స్పందించడం వంటి పరిణామాలు ఉత్కంఠను రేపాయి. చివరకు ఈనెల మొదటి వారంలో నిర్మలాదేవి వ్యవహారంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం దృష్టి పెట్టింది. పిటిషన్‌ దాఖలుతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది

ఎట్టకేలకు బయటకు: ఈనెల 12న న్యాయమూర్తులు కృపాకరణ్, సుందర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఎదుట నిర్మలాదేవిని సీబీసీఐడీ వర్గాలు హాజరు పరిచాయి. విచారణ, వాదనల అనంతరం నిర్మలాదేవికి నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ  న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. 11 నెలల అనంతరం నిర్మలాదేవికి బెయిల్‌ లభించించినా, జైలు నుంచి బయటకు వచ్చేందుకు అడ్డంకులు తప్పలేదు. ఇందుకు కారణం పూచీకత్తు ఇచ్చేందుకు కుటుంబీకులు ఎవ్వరూ ముందుకు రాకపోవడమే. దీంతో బెయిల్‌ లభించినా వారం రోజులుగా ఆమె బయటకు రాలేని పరిస్థితి. ఎట్టకేలకు ఆమె సోదరుడు రవి, బంధువు మాయాండి స్పందించారు. నిర్మలాదేవికి తమ పూచీకత్తును ఇవ్వడంతో మదురై కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం మధ్యాహ్నం ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. సోదరుడు, బంధువు, న్యాయవాదితో కలిసి ఆమె కారులో బయలుదేరి వెళ్లారు. కోర్టు ఆంక్షల దృష్ట్యా, ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆమె తరఫున న్యాయవాది పసుం పొన్‌పాండి మాట్లాడుతూ గవర్నర్‌ను టార్గెట్‌ చేశారు.

గవర్నర్‌ ఎక్కడ: న్యాయవాది మాట్లాడుతూ ఈ కేసులో నిర్మలాదేవిని అన్యాయంగా ఇరికించారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలు ఈ వ్యవహారం వెనుక ఉన్నాయని, బెయిల్‌ లభించకుండా అడ్డుకున్న వాళ్లు, తాజాగా పూచీకత్తు ఇవ్వకుండా ఆమె కుటుంబీకులకు బెదిరింపులు సైతం ఇచ్చారని ఆరోపించారు. అందుకే బెయిల్‌ వచ్చినా వారం రోజుల అనంతరం జైలు నుంచి బయటకు రావాల్సిన పరిస్థితిగా పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్‌ ఢిల్లీలో ఉన్నారా..గిండిలో ఉన్నారా అని ప్రశ్నించారు. నిర్మలాదేవి వ్యవహారంలో దూకుడు ప్రదర్శించిన వాళ్లకు పొల్లాచ్చి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పొల్లాచ్చిలో వందలాది మంది యువతుల జీవితాలతో చెలాగాటం ఆడిన మృగాళ్ల వ్యవహారం గవర్నర్‌కు కనిపించ లేదా అని ప్రశ్నించారు. నిర్మలాదేవి వ్యవహారంలో ఆగమేఘాలపై ప్రకటనతో పాటు సంతానం కమిటీని రంగంలోకి దించిన గవర్నర్, పొల్లాచ్చి వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎందుకంటే, అక్కడ చిక్కిన వాళ్లంతా, రాజకీయ ప్రబద్ధులకు చెందిన వారే అని మండి పడ్డారు. ఈ కేసులో నిర్మలాదేవి నిర్ధోషిగా బయటకు రావడం ఖాయం అని ఈసందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top