తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని అన్ని వర్గాల ఓటర్లకు మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తోన్న బీజేపీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఇందుకు అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించింది.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఎనిమిదిన నరేంద్ర మోడీతో చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఢిల్లీ బీజేపీ ప్రకటించింది. ఇందుకోసం రాజధానివ్యాప్తంగా నగరంలో 70 చోట్ల చౌపాల్ (రచ్చబండ)లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన విభిన్న అంశాలపై ప్రజలతో చర్చిస్తారని పేర్కొంది.
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని అన్ని వర్గాల ఓటర్లకు మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తోన్న బీజేపీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఇందుకు అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఇంటర్నెట్ ద్వారా ఈ నెల ఎనిమిదిన నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా ప్రజలతో మాట్లాడించడానికి సన్నాహాలు చేస్తోంది. వర్చువల్ వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో మోడీ విభిన్న అంశాలపై ప్రజలతో చర్చిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజధానిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఢిల్లీ బీజేపీ నడుం బిగించింది. ఇందుకోసం నగరంలో 70 చోట్ల ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నగరంలో 70 చోట్ల చౌపాల్‌లు ఏర్పాటు చేస్తామని, వాటిలో పాల్గొనడానికి వచ్చే వారికి బీజేపీ కార్యకర్తలు టీ ఇవ్వడంతోపాటు బీజేపీ విధానాలు, రాజకీయ సిద్ధాంతాల గురించి అవగాహన కల్పిస్తారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
ఓ పక్క నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి నగరంలోని ఏడు లోక్‌సభ స్థానాలను దక్కించుకునేందుకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ వ్యూహరచన చేస్తుండగా, ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ టికెట్ ఇవ్వకపోవడమే మేలని హర్షవర్ధన్ ఇటీవల చేసిన ప్రకటన వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్ ఇవ్వాలా వద్దా అనే విషయమై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని హర్షవర్ధన్ చెప్పారు. ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన తెలిపారు. అయితే ఈ అభిప్రాయం పలువురు ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు. విజయావకాశాలు ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలని, లేకపోవతే పార్టీ నష్టపోతుందని ఆశావహులు అంటున్నారు.