అధికారమే మార్పు లక్ష్యంగా డీఎంకేను ఆదరించాలని ఓటర్లకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి విన్నవించారు.
డీఎంకేను ఆదరించండి
ఓటర్లకు కరుణ పిలుపు
ప్రచారానికి శ్రీకారం
సైదాపేటలో భారీ బహిరంగ సభ
ఐక్యతతో పనిచేయండని కార్యకర్తలకు పిలుపు
అధికారమే మార్పు లక్ష్యంగా డీఎంకేను ఆదరించాలని ఓటర్లకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి విన్నవించారు. వరద ప్రళయంలో ప్రజలు తల్లడిల్లుతుంటే అడుగు బయట పెట్టకుండా, సుఖవంత జీవనం సాగించిన ఆ మహారాణిని సాగనంపుదామని పిలుపునిచ్చారు. సైదాపేట వేదికగా ఎన్నికల ప్రచారానికి శనివారం కరుణానిధి శ్రీకారం చుట్టారు.
చెన్నై : అధికారం పగ్గాలు చేపట్టాలన్న కోటి ఆశలతో డీఎంకే వర్గాలు ప్రచారంలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. తొమ్మిది పదులు దాటిన వయస్సులో వయోభారంతో కరుణానిధి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాలకు దూరంగానే ఉన్నారు. కేవలం కొన్ని చోట్ల బహిరంగ సభల్లో మాత్రం పాల్గొన్నారు. అయితే, ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఓ వైపు డీఎంకే దళపతి స్టాలిన్, మరో వైపు కుమార్తె కనిమొళి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతుండగా, ఇక తాను సైతం అంటూ కరుణానిధి కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటన సాగేందుకు వీలుగా ప్రత్యేక ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేయించారు. శనివారం సైదాపేట వేదికగా ప్రచారానికి కరుణానిధి శ్రీకారం చుట్టారు. కరుణానిధి వెంట మనవడు.
కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ ప్రచారరథంలో గోపాలపురం నుంచి కదిలారు. అన్నా అరివాలయం వద్ద కరుణానిధికి మహిళా విభాగం వర్గాలు కర్పూర హారతులు పట్టాయి. సైదాపేటలో ఏర్పాటు చేసిన వేదికపై అక్కడి అభ్యర్థి సుబ్రమణియన్, వేళచ్చేరి- వాగై చంద్రశేఖర్, టీనగర్ - కనిమొళి తదితర అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసి ప్రసంగించారు.
ఆదరించండి: స్వలాభం కోసం తాను పాకులాడడం లేదని చెప్పారు. ఐదేళ్లుగా ఈ అన్నాడీఎంకే సర్కారు ప్రజలకు చేసింది శూన్యమేనని ఆరోపించారు. గతంలో తాము చేసిన పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు మాత్రమే చేశారని వివరించారు. అహంకార పూరితంగా, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి నియంతలా వ్యవహరిస్తున్న ఆ మహారాణిని సాగనంపేందుకు ప్రజలు కంకణబద్దులు కావాలని ప్రజలను కోరారు.
వర్షాలు సృష్టించిన వరద ప్రళయంతో ప్రజలు తల్లడిల్లుతుంటే, వారిని ఓదార్చేందుకు కూడా అడుగు బయట పెడ్డకుండా సుఖవంత జీవితాన్ని సాగించిన ఆ మహారాణి పతనం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఓట్లు వేయించుకుని మాట మార్చే తత్వం తనది కాదు అని, తప్పకుండా అన్నింటినీ అమలు చేసి తీరుతానని నమ్మకంతో ఆదరించాలని విన్నవించారు.
సుఖవంత జీవితాన్ని అలవాటు పడ్డారు కాబట్టే, ఇప్పుడు కూడా హెలికాప్టర్లో తిరుగుతూ ఓటర్ల వద్దకు వస్తున్నారనని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఉద్దేశించి మండి పడ్డారు. సెంబరంబాక్కం డ్యాం నీటి విడుదలకు గల కారణాలు, ఇందుకు బాధ్యుల గురించి కనీసం విచారణ కూడా చేపట్టకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా ఇంట్లో హాయిగా నిద్ర పోయిన ఈ సీఎం తీరును ఓ మారు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ మహారాణి పతనాన్ని కాంక్షిస్తూ అధికార మార్పు దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా కుమారుడు, దళపతి స్టాలిన్ రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తున్నారని గుర్తు చేశారు.
ఇక, ‘ తానూ మీ ముందుకు వస్తున్నానని తనను అంటే వ్యక్తిగతంగా తనన్కొడినే కాదు డీఎంకే , కాంగ్రెస్ కూటమి’ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. పార్టీ వర్గాలు, కార్యకర్తలు అన్నదమ్ముల వలే ఐక్యతతో పనిచేయాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అధికార పగ్గాలు లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని వాళ్లకేదో దారాదత్తం చేసినట్టుగా, పట్టా ఇచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ నోళ్లకు కళ్లెంపడే విధంగా తనకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. నమ్మకంతో ఓట్లు వేసి ఆదరించాలని, అదే నమ్మకంతో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసి తీరుతానని కరుణానిధి హామీ ఇచ్చారు.