అసెంబ్లీ సమావేశాలకు బుధవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుల్లో పడింది. మంత్రులతో మంగళవారం సీఎం జయలలిత
కసరత్తులు!
Jan 29 2014 3:01 AM | Updated on Sep 2 2017 3:06 AM
ఙసాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాలకు బుధవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుల్లో పడింది. మంత్రులతో మంగళవారం సీఎం జయలలిత సమావేశమయ్యారు. శాఖల వారీగా చర్చించారు. ఇక, బన్రూటి రామచంద్రన్ రాజీనామాతో పార్టీ శాసన సభా పక్ష ఉప నేత ఎంపికపై డీఎండీకే అధినేత విజయకాంత్ దృష్టి కేంద్రీకరించారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశం ఆరంభం కానుంది. ఈ ఏడాదికి తొలి సమావేశం కావడంతో గవర్నర్ రోశయ్య ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ప్రసంగం ద్వారా సరికొత్త పథకాల్ని, ప్రాజెక్టుల్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఆయా విభాగాల వారీగా జరిగిన అభివృద్ధి, ఇక చేపట్టాల్సిన అంశాలు, ఆయా విభాగాల వారీగా రూపొందించిన కొత్త పథకాలు, పనుల గురించి మంత్రులతో సీఎం జయలలిత సమావేశం అయ్యారు. ఆయా శాఖల్లోని పనుల వివరాల్ని, తాజాగా జరిగిన కేటాయింపులపై సమీక్షించారు. మంత్రివర్గంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, వాటిని గవర్నర్ ప్రసంగంతో జత చేయడానికి నిర్ణయించడం గమనార్హం.
ఉప నేత: పార్టీ శాసనసభా పక్ష ఉప నేత పదవికి, ఎమ్మెల్యే పదవికి బన్రూటి రామచంద్రన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలో సస్పెన్షన్ వేటు పడ్డాక, అసెంబ్లీలో అడుగు పెట్టడం విజయకాంత్ మానేశారు. ఆయన స్థానంలో ఉండి పార్టీ శాసన సభా వ్యవహారాల్ని, ప్రధాన ప్రతి పక్షం బాధ్యతల్ని ఉప నేత బన్రూటి రామచంద్రన్ నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన లేని లోటు డీఎండీకేకు కన్పిస్తున్నది. తాజా సమావే శాల్లో విజయకాంత్ అసెంబ్లీలో అడుగు పెట్టేనా అన్నది అనుమానమే. ఈ దృష్ట్యా, విజయకాంత్ ప్రతినిధిగా అసెంబ్లీలో గళాన్ని ఎవరు విన్పించనున్నారోనన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం తరపున ఉపనేతగా ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సమర్థడైన ఎమ్మెల్యే అవసరం విజయకాంత్‌కు ఏర్పడింది. దీంతో ఉప నేత ఎంపికపై దృష్టి కేంద్రీ కరించారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన పిలుపు నిచ్చారు. ఇందులో ఉప నేత ఎవరన్నది తేల్చనున్నారు. బన్రూటి రామచంద్రన్ తర్వాత అసెంబ్లీలో డీఎండీకే గళాన్ని విన్పిస్తున్న ఎమ్మెల్యే పార్టీ విప్ చంద్రకుమార్. మరో ఎమ్మెల్యే వెంకటేష్ కూడా అనర్గళంగా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయగలరు. ఈ ఇద్దరిలో ఉప నేత పదవి ఎవరో ఒకర్ని వరిస్తుందో లేదా ఇతరులకు అవకాశం ఇచ్చేనా అన్నది వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement