మెట్రోరైలుకు 12 ఏళ్లు | Delhi Metro swooshes into 12th year of operation | Sakshi
Sakshi News home page

మెట్రోరైలుకు 12 ఏళ్లు

Dec 24 2013 11:31 PM | Updated on Sep 2 2017 1:55 AM

డీఎంఆర్సీ సేవలకు 12 ఏళ్లు నిండడంతో ఈ సంస్థ మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భవిష్యత్‌లోనూ మెట్రో విస్తరణ పనులు

డీఎంఆర్సీ సేవలకు 12 ఏళ్లు నిండడంతో ఈ సంస్థ మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భవిష్యత్‌లోనూ మెట్రో విస్తరణ పనులు చురుగ్గా కొనసాగిస్తామని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కార్యనిర్వాహక అధికారి అనుజ్ దయాళ్ అన్నారు.
 
 న్యూఢిల్లీ: ప్రతినిత్యం లక్షలాది మందికి సేవలు అందిస్తున్న ఢిల్లీ మెట్రోరైలుకు ఈ నెల 24తో 12 ఏళ్లు నిండాయి. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సేవలు 2002, డిసెంబర్ 24న లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ‘మేం తొలుత 8.5 కిలోమీటర్ల మేర, ఆరు స్టేషన్లతో షహద్రా నుంచి తీస్‌హజారీ మార్గంలో చేపట్టిన సేవలను అప్పటి ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అప్పుడు ఆరు రైళ్లను ఒకేరోజు 775 కిలోమీటర్లు తిప్పాం’ అని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కార్యనిర్వాహక అధికారి అనుజ్ దయాళ్ అన్నారు. 
 
 పస్తుతం ఢిల్లీ మెట్రోరైళ్లు ప్రతినిత్యం 70 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 23 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయని వివరించారు. ఆయన కథనం ప్రకారం.. డీఎంఆర్సీ 2002 డిసెంబర్‌నాటికి నిత్యం లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఈ ఏడాది ఆగస్టు ఎనిమిది నాటికి ఈ సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఆగస్టు 19న ఏకంగా 26 లక్షల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారు. పుష్కర వ్యవధిలో ఇన్ని లక్షల మందికి సేవలు అందించినందుకు గర్విస్తున్నామని దయాళ్ అన్నారు. ఈ కాలం లో డీఎంఆర్సీ సాధించిన విజయాలను కూడా ఆయన ప్రస్తావించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి మెట్రోరైలు మొదటికోచ్‌ను మహిళలకు మాత్రమే రిజర్వు చేశామని వివరించారు. 
 
 చురుగ్గా మూడోదశ నిర్మాణ పనులు 
 విస్తరణలో భాగంగా డీఎంఆర్సీ చేపట్టిన మూడోదశ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల మెట్రోమార్గాలు, స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. 2016 కల్లా మూడోదశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడోదశలో మొత్తం 103.05 కిలోమీటర్ల మేర మెట్రోమార్గాలను నిర్మిస్తారు. ముకుంద్‌పూర్-యమునావిహార్ కారిడార్‌ను 55.69 కిలోమీటర్ల పొడవున, జనక్‌పురి వెస్ట్-కాళిందికుంజ్ కారిడార్‌ను 33.49 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీగేట్ మార్గాన్ని 9.37 కిలోమీటర్ల పొడవున, జహంగీర్‌పురి-బద్లి మార్గాన్ని 4.489 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఈ దశలో 67 స్టేషన్లు, 15 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉంటాయి.
 
 2016 నాటికి ఢిల్లీ మెట్రోరైళ్లలో ప్రతినిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మూడోదశ నిర్మాణానికి రూ.35,242 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. మూడోదశలో అనేక మార్గాలను భూగర్భంలో నిర్మిస్తారు. వీటి కోసం సొరంగాలను తవ్వడానికి విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను (టీబీఎం) తెప్పించారు. అంతేకాదు పలు మార్గాల్లోని రైళ్ల బోగీల సంఖ్యను నాలుగు నుంచి ఆరుకు పెంచారు. టికెట్ల కొనుగోలు కోసం వెండింగ్ మెషీన్లు, టోకెన్ల వంటి సదుపాయాలు కల్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement