దర్శకుడు చేరన్ కూతురు దామిని ప్రేమ వ్యవహారం తీవ్రమవుతోంది. దామిని అమాయకురాలని, ప్రేమ పేరుతో చంద్రు మోసం చేస్తున్నారని, అతనిది నేరపూరిత
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : దర్శకుడు చేరన్ కూతురు దామిని ప్రేమ వ్యవహారం తీవ్రమవుతోంది. దామిని అమాయకురాలని, ప్రేమ పేరుతో చంద్రు మోసం చేస్తున్నారని, అతనిది నేరపూరిత చరిత్ర అని చేరన్ దంపతులు ఆరోపించారు. దామిని మాత్రం తన ప్రేమికుడ్ని వదిలేది లేదంటూ స్పష్టం చేసింది. చేరన్ వర్గం తనను మోసగాడిగా చిత్రీకరిస్తున్నట్లు చంద్రు ఆరోపిస్తున్నాడు. మరోపక్క డ్యాన్సర్‌గా అతను అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన దృశ్యాలు ఇంటర్నెట్‌లో ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి.
మరో పక్క పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఈ వ్యవహారం తాజాగా కోర్టుకెక్కింది. చంద్రు తల్లి చేరన్ కూతుర్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది. ఆమె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తులు ధనపాలన్, సి.బి సెల్వం సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. చంద్రు తల్లి ఈశ్వరి అమ్మాళ్ తరపున న్యాయవాది శంకర సుబ్బు వాదనలు వినిపించారు. దర్శకుడు చేరన్ కూతురు దామినిని చంద్రు ప్రేమించారని తెలిపారు. దీంతో చేరన్ తన అనుచరులతో అతనిపై హత్యాయత్నం చేయించారని తెలిపారు. ఈ విషయమై చేరన్ కూతురు దామిని పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు.
అయినా దామినిని పోలీసులు విచారణ పేరుతో సంరక్షణ హాస్టల్‌లో ఉంచారని ఆరోపించారు. ఈ కేసును అత్యవసర విభాగంలో విచారించాలని కోరారు. వాదోపవాదాలను విన్న న్యాయమూర్తులు ఈ కేసును అత్యవసర విచారణకు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదే విదంగా చేరన్ కూతురు దామినిని కోర్టుకు హాజరు పరచాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు దామినిని కోర్టులో హాజరుపరిచారు. అదే విధంగా చేరన్ తన భార్య, పెద్ద కూతురుతో కోర్టుకు హాజరయ్యారు.