అర్ధరాత్రి వరకు తప్పతాగిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు రవాణా సదుపాయమేదీ లేకపోవడంతో ఎదురుగా కనిపించిన ఓ ఆటోను ఎత్తుకెళ్లిపోయారు.
సాక్షి, ముంబై: అర్ధరాత్రి వరకు తప్పతాగిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు రవాణా సదుపాయమేదీ లేకపోవడంతో ఎదురుగా కనిపించిన ఓ ఆటోను ఎత్తుకెళ్లిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోమవారం సాయంత్రం ఎంహెచ్‌బీ కాలనీలో జరిగింది. దొంగతనానికి పాల్పడినవారంతా డిగ్రీ చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. అందిన వివరాలమేరకు... లఖన్ మురగన్ అనే వ్యక్తి తన పిన్నీని బోరివలిలో దింపేందుక స్నేహితులతో కలిసి నెరుల్‌కు వచ్చాడు. ఆమెను దింపేసిన అనంతరం ఎంహెచ్‌బీ కాలనీలోని ఓ బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం సేవించడం మొదలుపెట్టాడు. అలా కబుర్లు చెప్పుకుంటూ అర్ధరాత్రి వరకు అక్కడే గడిపారు. తీరా బయటకి వచ్చాక చూస్తే ఇంటికి వెళ్లేందుకు ఎటువంటి రవాణా సదుపాయం లేదు.
దీంతో ఏం చేయాలో పాలుపోని వారికి కళ్లముందు ఓ ఆటో కనిపించింది. ఇంకేముందు ఎంచక్కా ఆ ఆటోను దొంగిలించి, దాంట్లో ఇంటికి వెళ్లిపోవాలని డిసైడయ్యారు. అయితే దాని తాళంచెవి లేకపోవడంతో వైర్లను కత్తిరించి, డెరైక్ట్ కనెక్షన్ ఇచ్చారు. అనంతరం ఆటోను స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరారు. అయితే ఇదంతాగమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దహిసర్‌లోని విఠల్ మందిరం వద్ద వారిని అడ్డుకున్నారు. ఊహించని పరిణామంతో అవాక్కయిన ‘దొంగల ముఠా’ చెరోవైపు పరుగులు పెట్టారు. అయితే లఖన్ మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. మొదట వీరిని ఆటోలు దొంగిలించే ముఠాగా భావించిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. తాము దొంగలం కాదని, ఇంటికి వెళ్లేందుకు ఏమీ లేకపోవడంతో ఆటోను తీసుకొచ్చామని, తామంతా విద్యార్థులమని లఖన్ పోలీసులతో చెప్పడంతో మిగతా వారి కోసం వేట ప్రారంభించారు. లఖన్ స్నేహితుల్లో ఒకడైన ఇర్ఫాన్‌ను కూడా అరెస్టు చేశామని, మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.