గడియారంలోని ముల్లులాగా ఉదయం నుంచి పరుగులు తీసే ముంబైకర్లలో చాలా మందికి ‘వైట్ కొలెస్ట్రాల్’ పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
సాక్షి, ముంబై: గడియారంలోని ముల్లులాగా ఉదయం నుంచి పరుగులు తీసే ముంబైకర్లలో చాలా మందికి ‘వైట్ కొలెస్ట్రాల్’ పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, చాలా రోగాలకు కారకమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ హానికర పదార్థం పెరుగుదలకు ముంబైకర్ల జీవనవిధానమే ప్రధాన కారణమని తేలింది. ఉద్యోగులు కార్యాలయాల్లో గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, పనిఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, చిరుతిళ్ల వం టివి కొలెస్ట్రాల్ పెరుగుదలకు దోహం చేస్తున్నాయి. ఈ సమస్య 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారిలో అత్యధికంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఒక ప్రైవేటుల్యాబ్‌లో 0 నుంచి 70 సంవత్సరాల వయసున్న 19,655 ముంబైకర్ల కొలెస్ట్రాల్‌స్థాయులను పరీక్షిం చారు. అందులో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న 1,760 మంది వ్యక్తులకు కొలెస్ట్రాల్ ఉన్న ట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో 524 మందికి వైట్ కొలెస్ట్రాల్ ఉన్నట్లు బయటపడింది. మరో 540 మందికి కొలెస్ట్రాల్ అబ్‌నార్మల్ (అసాధారణ పరిమాణం) ఉన్నట్లు తెలిసింది. అదేవిధం గా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న 2,613 మం దిని పరిక్షించగా అందులో 786 మందికి వైట్ కొలెస్ట్రాల్ కాస్త ఎక్కువగా ఉండగా, 799 మంది కి అబ్‌నార్మల్‌గా ఉన్నట్లుగా తేలింది. వయసు 60 ఏళ్లు పైబడిన వారి లో కొలెస్ట్రాల్ ఉండడం సహజమని చెబుతారు. కానీ 30 నుంచి 40 ఏళ్లలోపు వ్యక్తుల్లోనూ కొలెస్ట్రాల్ కనిపిస్తే వాళ్లు భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లోకి అనేక కంపెనీల కొత్త మందులు వచ్చాయి. వీటితో కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. అయితే ఈ మందుల వల్ల శరీరానికి పొంచి ఉన్న హాని నుంచి మాత్రం తప్పించుకోలేం. 30 ఏళ్ల వయసులో ఇలా కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యదృష్ట్యా ఎంతమాత్రమూ మంచి కాదని డాక్టర్ జితేందర్ భాటియా అన్నా రు. ఆరోగ్యానికి మేలు చేసే జీవనశైలిని అలవర్చుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుదల సమస్య ఉండబోదని ఈ సీనియర్ వైద్యుడు అన్నారు. ముంబైకర్లలో చాలా మంది రోడ్లపై విక్రయించే తినుబండరాలకు అలవాటుపడతారు. అల్పహారంగా లేదా ఆకలేస్తే వడాపావ్, బజ్జీపావ్, ఉసల్, మిసల్ పావ్ లాంటి చిరుతిళ్లు తిని పూట గడిపేస్తారు. వీటి తయారికి ఉపయోగించే నూనె, ఇతర పదార్థాల్లో నాణ్యత ఉండదు. స్టాళ్ల వద్ద డ్రమ్ముల్లో నిల్వచేసిన తాగునీటిలో స్వచ్ఛత కనిపించదు. ఇలాంటివి శరీరానికి తీవ్రహాని చేస్తాయని భాటియా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.