పట్టణంలోని తెలుగువాళ్లు పోచమ్మ బోనాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు నైవేద్యం సమర్పించారు.
పట్టణంలోని తెలుగువాళ్లు పోచమ్మ బోనాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు నైవేద్యం సమర్పించారు. జంతుబలిచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. గ్రామదేవత వరాలదేవి మందిరం వద్ద ఉదయం నుంచే వేలాది మంది అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అయితే ఈ ఏడు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కార్పొరేటర్ మురళి మచ్చ, లక్ష్మీ అశోక్‌పాటిల్ వివిధ సదుపాయాలు కల్పించారు. పోచమ్మను దర్శించుకోవడానికి కామత్‌ఘర్, బండారి కాంపౌండ్, పద్మనగర్, కన్నేరి తదితర దూరప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వర్షం కురవడంతో మందిర ప్రాంగణంలో మండపాలు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. భక్తుల రద్దీ వల్ల దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేశారు. భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కార్యవర్గ సభ్యులు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ పద్ధతిలో దర్శనానికి అనుమతించారు.
అంతేగాకుండా ప్రత్యేక వలంటీర్లను కూడా నియమించామని బోనాల నిర్వాహకులు నోముల శేఖర్, అధ్యక్షులు తుమ్మ రమేష్ పేర్కొన్నారు. అదేవిధంగా జంతుబలులు ఇచ్చే ప్రాంతాల్లో తగిన పారిశుద్ధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గతంలో మందిర ప్రాంగణంలో అమ్మవారి దర్శనం కోసం వర్షం కురుస్తున్నా గంటల తరబడి బారులుతీరేవాళ్లు. ఈసారి ఈ సమస్య నుంచి విముక్తి లభించిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.