బ్లాక్ డే అలర్ట్ | Black Day Alert | Sakshi
Sakshi News home page

బ్లాక్ డే అలర్ట్

Dec 5 2016 2:46 AM | Updated on Aug 20 2018 8:20 PM

బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన బ్లాక్ డేను పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పెంచారు.

నిఘా కట్టుదిట్టం
తనిఖీలు ముమ్మరం
ఉగ్రవాదుల ఇళ్లల్లో
ఎన్‌ఐఏ తనిఖీలు

 
సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన బ్లాక్ డేను పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారంలేని విధంగా నిఘాతో వ్యవహరించే పనిలో పడ్డారు. రైల్వేస్టేషన్లలో నిఘాను మరింతగా కట్టుదిట్టం చేశారు. ఇక, గత వారం మధురైలో పట్టుబడిన ఉగ్రవాదుల ఇళ్లల్లో ఎన్‌ఐఏ వర్గాలు తనిఖీల్లో పడ్డారుు.  బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన  డిసెంబర్ 6ను బ్లాక్ డేగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఈ రోజు వస్తుందంటే టెన్షన్ తప్పదు. ఆ రోజు గడిస్తే చాలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అరుుతే, ఈ ఏడాది రాష్ట్రంలో చాప కింద నీరులా సాగుతూ వస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలు ఓ వైపు, అల్‌ఖైదా మద్దతు ది బేస్ మూమెంట్ కార్యకలాపాలు మరో వైపు వెలుగులోకి రావడంతో ఉత్కంఠ తప్పలేదు. మదురై కేంద్రంగా సాగుతున్న ఆ సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నారు. ఈ సంస్థ వైపుగా మరెందరో యువత ఆకర్షితులై ఉండొచ్చన్న అనుమానాలతో దర్యాప్తు వేగం పెరిగింది.

శని, ఆదివారాల్లో మదురైలోని ఆయా ఉగ్రవాదుల ఇళ్లల్లో తనిఖీలు ముమ్మరంగా సాగడం ఆలోచించాల్సిందే. ఎన్‌ఐఏ ఎస్పీలు ప్రతిభా అంబేడ్కర్, రాహుల్ నేతృత్వంలో 20 మందితో కూడిన ఎన్‌ఐఏ వర్గాలు తనీఖీలు సాగించి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, అందులోని నంబర్ల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. ఈ సమయంలో బ్లాక్‌డే వస్తుండడంతో రాష్ట్రంలో  మునుపెన్నడూ లేని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యారుు.

తనిఖీలు - భద్రత:   రైల్వేస్టేషన్లు, బస్సుస్టేషన్లు, విమానాశ్రయాల్లో, ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ పోలీసు, సాయుధ రిజర్వు పోలీసుల సేవలను కూడా  వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద భద్రతా విషయంగా ప్రత్యేక  శ్రద్ధ తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. లాడ్జీలు, హోటళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ, విద్రోహక సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ భద్రతతో ముందుకు సాగుతున్నారు. చెన్నై మహానగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటుగా తనిఖీలు వేగవంతం చేశారు.

 శనివారం రాత్రి జరిపిన వాహనాల తనిఖీల్లో 1,967 మంది పట్టుబడ్డారు. వీరిలో కొందరిని విచారణ అనంతరం పంపింవేశారు. ఇక,  జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, సెంట్రల్,  ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లలో, కోయంబేడు బస్టాండులో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నారు. అలాగే రైళ్లలో తరలిస్తున్న, ఇక్కడికి వస్తున్న పార్శిళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సముద్ర తీరాల్లోనూ గస్తీ పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement