కాంగ్రెస్‌తో ఆప్ కుమ్మక్కు | Aam Aadmi Party striking secret deal with Congress: Vijay Goel | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో ఆప్ కుమ్మక్కు

Jan 16 2014 11:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ మాటలను ఆసరాగా

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాంగ్రెస్  కనుసన్నల్లో నడుస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ మాటలను ఆసరాగా చేసుకొని బీజేపీ కేజ్రీవాల్‌పై విమర్శల దాడిని పెంచింది. అవినీతి విషయంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, ఇప్పుడు బిన్నీ మాటలతో అవి నిజమని తేలిందని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ అన్నారు. అవినీతిని ఊడ్చేస్తామంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ఆప్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా దర్యాప్తునకు సిద్ధపడకపోవడం ఆ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందన్న దానికి నిదర్శనమన్నారు.
 
 షీలా కుమారుడు సందీప్ దీక్షిత్‌కు కేజ్రీవాల్‌తో మంచి సాన్నిహిత్యం ఉందని బిన్నీ చేసిన వ్యాఖ్యలు వారి లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెట్టాయన్నారు. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ  అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినా, కనీసం ఇప్పుడు ఈ విషయాన్ని ఆప్ పట్టించుకోవడం లేదు. దీనర్థం అవినీతితో ఆప్ పార్టీ రాజీకి వచ్చిందని తెలుస్తోంద’ని గోయల్ విమర్శించారు. రానున్న రోజుల్లో షీలాపై ఆప్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. ఆప్‌తో ఒరిగేదేమీ లేదని ఢిల్లీవాసులు తెలుసుకున్నారని, మోసపోయామని గ్రహించారని గోయల్ తెలిపారు. ఈ రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేనే వారి నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారన్నారు. 
 
 అసెంబ్లీ ఎన్నికలకు టికెట్లు కేటాయించిన నలుగురు అభ్యర్థులే ఇప్పుడు లోక్‌సభ వ్యవహారాలను చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నామని మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కేజ్రీవాల్ అహంకార పాలన నడుస్తోందని ఘాటైన విమర్శలు చేశారు. గతేడాది ఓ అవినీతి కేసులో సాక్ష్యాన్ని లేకుండా చేశారని ప్రత్యేక సీబీఐ కోర్టు మంత్రి సోమనాథ్ భారతిని ప్రశ్నించినా, కేజ్రీవాల్ పట్టించుకోకుండా వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. న్యాయశాఖ మంత్రి పదవి నుంచి సోమనాథ్‌ను ఈ నెల 26లోపు తప్పించకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఢిల్లీ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆప్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement