దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టీనగర్: దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐదు కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కర్ణాటక యువకుడిని అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు సెంట్రల్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సమాచారం అందింది. అధికారులు సోమవారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని దుబాయ్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలపై ప్రత్యేక నిఘా పన్నారు. ఇలావుండగా సోమవారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో దుబాయ్ నుంచి ఒక విమానం చెన్నై చేరుకుంది.
అందులోని ప్రయాణికుల వద్ద అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన విపుల్ అబ్దుల్ (30) దుబాయ్‌కు టూరిస్టు వీసాలో వెళ్లివచ్చినట్లు తెలిసింది. అతని వద్దనున్న సూట్‌కేస్‌లో తనిఖీ చేయగా అందులోనున్న రహస్య గదిలో 10 బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఐదు కిలోల బరువు కలిగిన ఈ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 1.5 కోట్ల రూపాయిలు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విపుల్ అబ్దుల్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద ప్రత్యేక విచారణ జరుపగా అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.