28 నుంచి ‘పీణ్యా-సంపిగే’ మెట్రో పరుగులు | 28 'pinya - sampige' Metro runs | Sakshi
Sakshi News home page

28 నుంచి ‘పీణ్యా-సంపిగే’ మెట్రో పరుగులు

Feb 25 2014 3:04 AM | Updated on Sep 2 2017 4:03 AM

సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ‘పీణ్యా-సంపిగే’ మార్గంలో మెట్రో సేవలు ఈనెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

  • 1 నుంచి ప్రయాణికులకు అనుమతి
  •  10 కిలోమీటర్ల దూరం.. పది స్టేషన్లు
  •  తొలుత మూడు బోగీల రైలు
  •  ‘స్మార్ట్ కార్డు’ వారికి టికెట్ ధరలో  డిస్కౌంట్
  •  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి
  •  సాక్షి, బెంగళూరు : సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ‘పీణ్యా-సంపిగే’ మార్గంలో మెట్రో సేవలు ఈనెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆ రోజున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించనున్నారు. తర్వాతి రోజు అంటే మార్చి ఒకటి నుంచి ఇందులో ప్రయాణించడానికి ప్రజలకు అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉన్న పీణ్యా-సంపిగే మార్గంలో పది స్టేషన్లు ఉంటాయన్నారు.

    మొదట ఈ మార్గంలో మూడు బోగీలు గల రైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇందులో సుమారు 975 మంది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి వీలువుతుందని తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల స్పందనను బట్టి బోగీల, సమయం పెంపు విషయమై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

    ఈ మార్గంలో ప్రయాణించే మెట్రో రైలు గరిష్టవేగాన్ని గంటకు 80 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లకు పెంచామన్నారు. ప్రస్తుతం ఓల్వో బస్సులో పిణ్యా నుంచి సంపిగే వరకూ చేరుకోవ డానికి ప్రయాణికులు రూ.45 చెల్లిస్తున్నారన్నారు. అదే సాధారణ బస్సులో రూ.16 వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునే ఈ రెండు మార్గాల మధ్య మెట్రో రైలులో ధరను రూ.23గా నిర్ణయించామని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డు పొందిన ప్రయాణికులకు ప్రయాణ ధరలో 15 శాతం రాయితీ కూడా దొరుకుతుందని తెలిపారు.

    ఈ మార్గంలోని స్టేషన్లలో వాహనాలకు పార్కింగ్ కల్పించే విషయమై బీబీఎంపీ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అస్కార్ ఫెర్నాండెజ్, మల్లిఖార్జున ఖర్గే, వీరప్పమొయిలీ తదితరులు పాల్గొననున్నారన్నారు. సీఎం సిద్ధరామయ్యతో కలిసి వీరు మెట్రోరైలులో రాజాజీనగర స్టేషన్ నుంచి పిణ్యా వరకూ ప్రయాణించి అక్కడి నుంచి సంపిగే స్టేషన్‌ను చేరుకోనున్నట్లు రామలింగారెడ్డి వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement