జెడ్పీలో ముసలం !

సూపరింటెండెంట్ల స్థానచలనంలో చైర్‌పర్సన్‌ ముద్ర

రబ్బర్‌ స్టాంప్‌ డ్యూటీపై సీఈవో మనస్తాపం

బదిలీ ప్రయత్నాల కోసం అమరావతికి..

జిల్లా పరిషత్‌లో మళ్లీ ముసలం మొదలైందా? చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, సీఈవో నగేష్‌ల మధ్య కోల్డ్‌ వార్‌ మరోసారి బయటపడిందా...అంటే నిజమే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు!

గతేడాది నుంచి చాపకింద నీరులా తీవ్రమవుతున్న ఈ వ్యవహారం తాజాగా కీలక ఉద్యోగుల స్థానచలనం నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది. జెడ్పీలో కీలక స్థానాల్లో సూపరింటెండెంట్ల స్థానచలనం ఫైళ్ల విషయంపై ముందస్తుగా సీఈవో నగేష్‌కు సమాచారం లేకపోయినా ఒత్తిళ్ల మ«ధ్య పరిపాలనా సౌలభ్యం కోసం అన్నట్లుగా ఆయన ఆమోద సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. ఇదే విషయంలో సీఈవో తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. విధులు, పరిపాలన విషయంలో తనపై చైర్‌పర్సన్‌ పెత్తనాన్ని ఏమాత్రం సహించలేని ఆయన బదిలీ ప్రయత్నాల కోసం అమరావతికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

అరసవల్లి: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చాలాచోట్ల అధికారులపై వేధింపులకు పాల్పడుతుండడం, రాజకీయ కక్షలు తీర్చుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో కూడా జిల్లా పరిషత్‌ సీఈవో స్థాయిని తగ్గించే యత్నంతో పాటు రబ్బర్‌ స్టాంప్‌లా ఆయన కుర్చీని మార్చేలా చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో జిల్లా పరిషత్‌కు చెందిన పాలనా వ్యవహారాలు, పలు ఆమోదాలకు చెందిన ఫైళ్లను అప్పటి జిల్లా కలెక్టర్‌కు నేరుగా పంపించేలా సీఈవో చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టిన చైర్‌పర్సన్, ఇప్పుడు సీఈవో అభిప్రాయం లేకుండానే కీలకమైన సూపరింటెండెంట్ల స్థానచలనాన్ని చేపట్టి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అయితే గతేడాది సాధారణ బదిలీల వ్యవహారాల్లో ఈ ఇరువురి వ్యవహారంతోనే రాష్ట్రంలో బదిలీలు రద్దయిన ఏకైక జిల్లా పరిషత్‌గా రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.. అలాగే పలు పరిణామాల అనంతరం సీఈవో నగేష్‌ను బదిలీ చేయిస్తున్నట్లు ఏకంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే అప్పట్లో సీఈవో నగేష్‌ ప్రయోగించిన ఎత్తులకు ఆమె ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 

ఆ తర్వాత జిల్లాకు చెందిన మంత్రులను సైతం రంగంలోకి దింపి సీఈవోపై ఒత్తిళ్లు తేచ్చే ప్రయత్నం చైర్‌పర్సన్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి సీఈవో నగేష్‌ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని..బదిలీ యత్నాల్లోనే ఉన్నారు. తాజాగా సూపరింటెండెంట్ల బదిలీ విషయంలో మరోసారి మనస్తాపానికి గురికావడంతో బదిలీ  ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇటీవల ఓ డెప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి జెడ్పీ సీఈవోగా అవకాశమివ్వాలంటూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు  వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో జెడ్పీలో మరికొద్ది రోజుల్లో చాలా తేడాొస్తాయని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

సూపరింటెండెంట్ల స్థానచలనం..
జిల్లా పరిషత్‌లో ఈనెల ఒకటి నుంచి పలువురు సూపరింటెండెంట్ల స్థానాలను అనూహ్యంగా మార్పులు చేస్తూ సీఈవో నగేష్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీని వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారంలో అంతా తానై అన్నట్లుగా పరిపాలన వ్యవహారాలపై చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి హవా చలాయిస్తూ ఈ ఫైళ్లపై సీఈవో ఆమోద సంతకం చేసేలా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈక్రమంలో అమలైన ఉత్తర్వుల మేరకు ఫ్లానింగ్‌ సెక్షన్‌కు బి.వి.రమణమూర్తి, ఎస్టాబ్లిస్‌ (సీ) సెక్షన్‌కు కె.రామేశ్వరరావు, డిస్పాచ్‌ సెక్షన్‌కు ఎస్‌.వాసుదేవరావును నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే వరŠుక్స (బీ సెక్షన్‌) ఇన్‌చార్జిగా కె.రామేశ్వరరావుకు, ఎడ్యుకేషన్‌ సెక్షన్‌కు ఇన్‌చార్జిగా ఎస్‌.వాసుదేవరావుకు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు కొత్త స్థానాల్లో అధికారులు విధుల్లోకి చేరిపోయారు. ఈ విభాగాల్లో బదిలీలకు పరిపాలనా సౌలభ్యం పేరుతో స్థాన చలనాలకు చర్యలు చేపట్టారు. అయితే అక్కౌంట్స్‌ విభాగం, పీఎఫ్‌ సెక్షన్లకు సూపరింటెండెంట్ల స్థానాల్లో మార్పులు మాత్రం చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ అధికారుల స్థానచలనం మళ్లీ చైర్‌పర్సన్‌కు, సీఈవోకు మధ్య చిచ్చు పెట్దిందనే చెప్పాలి. ఈ వివాదాల ముసలంతో జెడ్పీలో ఏమార్పులు జరుగుతాయో అని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top