నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్‌ అన్నాడు..!

Yuvraj Singh Recalls 2007 Six Sixes In An Over Against England's Match - Sakshi

13 ఏళ్ల నాటి ఘటనను గుర్తు చేసుకున్న యువరాజ్‌

ఇప్పుడు ఆ బౌలర్‌ వరల్డ్‌ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు

న్యూఢిల్లీ:  టీమిండియా కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని పగ్గాలు అందుకున్న ఏడాదే అద్భుతం చేశాడు. 2007లో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన ధోని.. అదే సంవత్సరం భారత్‌కు టీ20 వరల్డ్‌కప్‌ను సాధించిపెట్టాడు. ధోని నాయకత్వంలోని టీమిండియా సమష్టిగా రాణించడంతో టీ20 వరల్డ్‌కప్‌ ప్రారంభమైన ఏడాదే కప్‌ను చేజిక్కించుకుంది. కాగా, ఇందులో యువరాజ్‌ సింగ్‌ పాత్ర కీలకం. ప్రత్యేకంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌తో  మ్యాచ్‌లో భాగంగా యువరాజ్‌సింగ్‌ ఒకే ఓవర్‌లో కొట్టిన ఆరు సిక్స్‌లు ఇప్పటికే అభిమానులు మదిలో మెదులుతూనే ఉంటాయి. (అక్కడ బాక్సింగ్‌ మొదలైంది... )

ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఒక ఓవర్‌లో యువరాజ్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. లాంగాన్‌, లాంగాఫ్‌, మిడాన్‌ మీదులుగా వరుస సిక్స్‌లు బాది ఇది తన బ్యాటింగ్‌ పవర్‌ అని ప్రపంచానికి చాటిచెప్పాడు. దాంతో ప్రపంచ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన అరుదైన జాబితాలో యువరాజ్‌ స్థానం సంపాదించాడు. కాగా, ఆనాటి మ్యాచ్‌ను యువరాజ్‌ మళ్లీ గుర్తుచేసుకున్నాడు. నిజంగా అప్పుడు ఒకే ఓవర్‌లో కొట్టిన ఆరు సిక్స్‌లు ఇప్పటికీ తన కెరీర్‌లో చిరస్మరణీయమేమనని యువరాజ్‌ పేర్కొన్నాడు. ‘ నేను ఈ ఆరు సిక్స్‌లు కొట్టడానికి ముందు ఒక వన్డేలో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ దిమిత్రి మాస్కరెన్హాస్‌కు ఐదు సిక్స్‌లు సమర్పించుకున్నా.

అది జరిగిన కొద్ది సమయం వ్యవధిలోనే నేను ఆరు సిక్స్‌లతో ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాననే చెప్పాలి. ఇంగ్లండ్‌తో టీ20లో ఆరు సిక్స్‌లు కొట్టిన వెంటనే తొలుత ఫ్లింటాఫ్‌ వైపు చూశా. ఆ తర్వాత దిమిత్రి వైపు చూడగా అతను చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత రోజు స్టువర్ట్‌ బ్రాడ్‌ తండ్రి క్రిస్‌ బ్రాడ్‌ తారసపడ్డాడు.  మ్యాచ్‌ రిఫరీ అయిన క్రిస్‌ బ్రాడ్‌ నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్‌ అన్నాడు. ఇక అతని షర్ట్‌పై ఒక సంతకం చేసి నా కొడుకు స్టువర్ట్‌ బ్రాడ్‌కు ఇవ్వు అన్నాడు. దాంతో స్టువర్ట్‌ బ్రాడ్‌కు మెస్సెజ్‌ ఇవ్వడానికి నా టీమిండియా జెర్సీ తీసుకున్నా. దానిపై బ్రాడ్‌ కెరీర్‌ బాగుండాలని రాసి ఇచ్చా. నేను ఐదు సిక్స్‌లు ఇచ్చాను కాబట్టి ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. అందుచేత బ్రాడ్‌ కెరీర్‌ బాగుండాలని కోరుతూ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పా. ఇప్పుడు బ్రాడ్‌ ఒక అత్యుత్తమ బౌలర్‌. ప్రపంచంలో బెస్ట్‌ బౌలర్లలో బ్రాడ్‌ ఒకడు. ప్రస్తుతం ఉన్న టీమిండియా బౌలర్లలో ఏ ఒక్కరూ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు ఇస్తారని అనుకోవడం లేదు’ అని యువరాజ్‌ పేర్కొన్నాడు.(నా ప్రపంచకప్‌ పతకం కనిపించడంలేదు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top