యోగేశ్వర్ దత్కు ఒలింపిక్స్ రజత పతకం! | Sakshi
Sakshi News home page

యోగేశ్వర్ దత్కు ఒలింపిక్స్ రజత పతకం!

Published Tue, Aug 30 2016 9:07 AM

యోగేశ్వర్ దత్కు ఒలింపిక్స్ రజత పతకం!

తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్కు కాస్త ఊరట లభించనుంది. అదేంటీ.. పతకం ఓడిన వ్యక్తికి లాభించే అంశం ఏమిటని ఆలోచిస్తున్నారా..! లండన్ ఒలింపిక్స్లో 60 కేజీ ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగన యోగేశ్వర్ కాంస్య పతకాన్ని 'పట్టు'కొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఒలింపిక్స లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ పై తాజాగా జరిపిన డోప్ టెస్టుల్లో అతడి శాంపిల్స్ పాజిటీవ్ అని తేలింది. ఇప్పటివరకూ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రటకన వెలువడలేదు. 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీ గత ఒలింపిక్స్ వరకూ లేని కారణంగా దాదాపు అన్ని దేశాల అథ్లెట్ల శాంపిల్స్ పై తాజాగా టెస్టులు నిర్వహిస్తున్నారు.

ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ జరిపిన టెస్టుల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లుగా తేలింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన తమ అథ్లెట్ కుదుఖోవ్ డోపింగ్ టెస్టుల్లో విఫలమవడంతో రష్యా అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుదుఖోవ్ తో పాటు ఉజ్బెకిస్తాన్ కు చెందిన రెజ్లర్ తేమజోవ్(120కేజీ) కూడా పాజిటీవ్ అని తేలింది. తేమజోవ్ బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించాడు. వాడా టెస్టుల ఫలితాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం వెల్లడిస్తే వారి పతకాలు వెనక్కి తీసుకుంటారు. దీంతో లండన్ లో కాంస్యంతో మెరిసిన యోగేశ్వర్ రజత పతక విజేతగా మారి ఆ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సుశీల్ కుమార్ సరసన నిలవనున్నాడని అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement
Advertisement