ఈసారి ఇద్దర్నీ కలిపి ఆడించండి: భజ్జీ

Would Like To See Both Kuldeep And Chahal Play Together, Harbhajan - Sakshi

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించినా దాన్ని కాపాడుకోవడంలో విఫలం కావడంతో పరాజయం చెందింది. ఇప్పుడు రెండో వన్డేలో గెలిచి సిరీస్‌లో నిలవడానికి కసరత్తులు చేస్తోంది. మరొకవైపు కివీస్‌ తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను ముందుగానే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే టీమిండియాకు ఎంతో కీలకమైన రెండో వన్డేకు కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌తో బరిలోకి దిగితేనే మంచిదనే అభిప్రాయాన్ని హర్భజన్‌ సింగ్‌ వెల్లడించాడు.

‘న్యూజిలాండ్‌ ఏ రోజైనా, ఎక్కడైనా ఫాస్ట్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగానే ఆడుతుంది.కాకపోతే వారికి ప్రధాన సమస్య స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడమే. దాంతో రెండో వన్డేలో కుల్దీప్‌ యాదవ్‌తో పాటు యజ్వేంద్ర చహల్‌ను కూడా తీసుకుంటే బాగుంటుంది. వీరిద్దరూ మణికట్టు స్పిన్నర్లు కాబట్టి కివీస్‌ కాస్త తడబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇందుకోసం కేదార్‌ జాదవ్‌ను తప్పించాల్సి రావొచ్చు. నేనైతే ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో దిగితేనే మంచిది అనుకుంటున్నా’ అని భజ్జీ తెలిపాడు.

కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 347 పరుగులు చేసినా ఓటమి పాలైంది. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి వన్డేలో ఆడిన కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీసినా 84 పరుగులు ఇచ్చుకున్నాడు. అయినప్పటికీ కుల్దీప్‌ను అలానే ఉంచి చహల్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోమని హర్భజన్‌ హితవు పలికాడు. గతంలో వీరిద్దరూ కలిసి అనేక వన్డేల్లో రాణించిన సంగతిని గుర్తు చేశాడు. శనివారం టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆక్లాండ్‌లో రెండో వన్డే జరుగనుంది. (ఇక్కడ చదవండి: ‘టేలర్‌.. నాలుక ఎందుకు బయటకు తీస్తావ్‌’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top