
లండన్ : తొలి మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాపై గెలిచి ఊపుమీదున్న బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు షకీబుల్ హసన్(64) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌లు తలో రెండు వికెట్లు తీయగా, ఫెర్గుసన్, సాంట్నర్, గ్రాండ్‌హోమ్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్‌లు మంచి శుభారంభాన్నే అందించారు. అయితే భారీ స్కోర్ మలచడంలో విఫలమయ్యారు. సౌమ్య సర్కార్(25)ను హెన్రీ ఔట్ చేయడంతో బంగ్లా వికెట్ల పతనం ప్రారంభమైంది. అనంతరం మరో ఓపెనర్ తమీమ్(24) కూడా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన గత మ్యాచ్ హీరో రహీమ్(19) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నా షకీబ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో అర్దసెంచరీ పూర్తి చేసిన అనంతరం షకీబ్ కూడా వెనుదిరిగాడు. మిథున్(26), మహ్మదుల్లా(20), సైఫుధ్దీన్(29)లు భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. దీంతో 49.2 ఓవర్లలో 244 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌటైంది.