
విండీస్ మహిళలదే వరల్డ్ కప్
టీ 20 మహిళల ప్రపంచకప్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది.
కోల్కతా: టీ 20 మహిళల ప్రపంచకప్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం ఈడెన్ గార్డెన్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో విండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి కప్ ను దక్కించుకుంది. ఆసీస్ విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన విండీస్ టైటిల్ ను సగర్వంగా అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఆసీస్ ఆధిపత్యానికి గండికొట్టిన విండీస్ వరల్డ్ కప్ ను ఎగురేసుకుపోయింది. దీంతో వరుసగా నాల్గోసారి వరల్డ్ కప్ను సాధించాలనుకున్న ఆసీస్ ఆశలు తీరలేదు.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుని నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు నమోదు చేసింది. ఆస్ట్రేలియా మహిళల్లో విలానీ(52), కెప్టెన్ లానింగ్(52)లు రాణించగా, పెర్రీ(28) ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. హైలే మాథ్యూస్(66;45 బంతుల్లో 6 ఫోర్లు, 3 ఫోర్లు) చెలరేగగా,స్టాఫానీ టేలర్(59; 57 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడింది. ఈ జోడి తొలి వికెట్ కు 120 భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విండీస్ విజయం లాంఛనమైంది. ఇక చివర్లో డోటిన్(18 నాటౌట్), కూపర్(3 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో విండీస్ ఇంకా మూడు బంతులుండగానే విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.