
కోహ్లి ఫాస్టెస్ట్ సెంచరీ; భారత్ గ్రాండ్ విక్టరీ
భారత్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదయింది. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత ఘన విజయం సాధించింది.
జైపూర్: భారత్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదయింది. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత ఘన విజయం సాధించింది. 9 వికెట్లతో ఓడించి కంగారూలను చిత్తుచేసి మొదటి మ్యాచ్లో ఓటమికి బదులు తీర్చుకుంది. ఆసీస్ నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 6.3 ఓవర్లు మిగులుండగానే విజయాన్ని అందుకుంది. 43.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 362 పరుగులు చేసింది. ప్రపంచ వన్డే క్రికెట్లో రెండో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ ధాటికి భారీ లక్ష్యం చిన్నబోయింది. రోహిత్, కోహ్లి సెంచరీలతో హోరెత్తించారు. ధావన్ తృటిలో శతకం కోల్పోయినా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
కోహ్లి ఫాస్టెస్ట్ సెంచరీ
శిఖర్ అవుటయిన తర్వాత క్రీజ్లో అడుగుపెట్టిన కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్ తరపున వేగంగా సెంచరీ సాధించిన ఘనత సాధించాడు. ప్రపంచ ఆటగాళ్లలో ఏడో బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 16వ సెంచరీ. 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
కోహ్లి కంటే ముందు రోహిత్ సెంచరీ సాధించాడు. 102 బంతుల్లో 11 ఫోర్లు, ౩ సిక్సర్లతో శతకం పూర్తి చేసిన రోహిత్ 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధావన్ 95 పరుగులు చేసి ఫాల్క్‌నర్ బౌలింగ్లో అవుటయ్యాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు