
'ఫ్యాన్స్' ఆఫ్ సర్ఫరాజ్
ఒక్క ఇన్నింగ్స్ అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడేలా చేసింది. సరదాగానైనా కెప్టెన్ కోహ్లి 'దండం' పెడుతూ జూనియర్ సహచరుడికి చేసిన అభినందన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది.
ఒక్క ఇన్నింగ్స్ అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడేలా చేసింది. సరదాగానైనా కెప్టెన్ కోహ్లి 'దండం' పెడుతూ జూనియర్ సహచరుడికి చేసిన అభినందన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆ 'బొద్దు' అబ్బాయే సర్ఫరాజ్ ఖాన్. మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతల నుంచి సాధారణ క్రికెట్ ప్రేమికుల వరకు అంతా సోషల్ సైట్లలో అతడిపై ప్రశంసలు కురిపించారు. మియాందాద్‌తో ఒకరు పోలిస్తే, మరొకరు రణతుంగతో, ఇంకొకరు అరవింద డిసిల్వాతో పోలుస్తూ సర్ఫరాజ్‌ను పొగిడారు. బుధవారం మ్యాచ్‌లో అతను చెలరేగిన తీరు చూస్తే అతను దీనికి అర్హుడే అనిపిస్తుంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో అతను చూడచక్కటి షాట్‌లు ఆడాడు. ఒక్క మ్యాచ్‌కే గొప్పలా... అనిపించవచ్చు కానీ ముంబైకర్ సర్ఫరాజ్ ఆటను బట్టి అతని ప్రతిభపై అంచనాలు వచ్చేయవచ్చు.
ఎవరీ సర్ఫరాజ్: సరిగ్గా వారం క్రితం ఐపీఎల్‌లో ఆడిన అతి చిన్న వయసు ఆటగాడి (17 ఏళ్ల 177 రోజులు) సర్ఫరాజ్ ఘనత సాధించాడు. 2009లోనే ప్రఖ్యాత ముంబై స్కూల్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో 439 పరుగులతో కొత్త రికార్డు సృష్టించడంతో అతను వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ముంబై అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న అతను కొద్ది రోజులకే భారత్ అండర్-19 టీమ్‌కు ఎంపికయ్యాడు. 15 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లోనే 101 పరుగులు కొట్టడంతో ఖాన్ సత్తా అందరికీ తెలిసింది. ఆ తర్వాత అండర్-19 ప్రపంచ కప్ కూడా ఆడాడు. మధ్యలో ‘వయసు’ గురించి వివాదం వచ్చినా...చివరకు అది తప్పని తేలింది. ఆ తర్వాత మానసికంగా మరింత దృఢంగా మారిన ఈ టీనేజర్ ముంబై రంజీ జట్టు తరఫున కూడా గతేడాది అరంగేట్రం చేశాడు.