సచిన్‌ రికార్డ్‌ మళ్లీ బ్రేక్‌ చేసిన కోహ్లి

Virat Kohli Beats Sachin Tendulkar to Become 3rd Fastest to 22 Test Tons - Sakshi

బర్మింగ్‌హామ్‌ : కీలక సమయంలో విదేశీగడ్డపై అద్బుత శతకం సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్‌) మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శతకంతో ఈ ఫార్మాట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 22కు చేరుకుంది. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కోహ్లి దాటేశాడు. 22 టెస్ట్‌ శతకాలకు సచిన్‌ 114 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. కెప్టెన్‌ కోహ్లి 113వ ఇన్నింగ్స్‌లో ఆ ఫీట్‌ సాధించాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా ఈ ఫీట్‌ చేరుకున్న ఆటగాళ్లలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన 13వ భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. 

అయితే ఓవరాల్‌గా అత్యంత వేగవంతగా 22 టెస్ట్‌ శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో క్రికెట్‌ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కేవలం 58 ఇన్నింగ్స్‌ల్లోనే బ్రాడ్‌మన్‌ 22 శతకాలు చేయగా.. అనితరసాధ్యంగా ఆ రికార్డు చిరస్థాయిగా ఉండిపోయింది. సునీల్‌ గావస్కర్‌ 101 ఇన్నింగ్స్‌ల్లో, స్టీవ్‌ స్మిత్‌ 108 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్‌ నమోదు చేసి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కోహ్లి (113 ఇన్నింగ్స్‌), సచిన్‌ (114 ఇన్నింగ్స్‌లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా, గతంలో సచిన్‌ వేగవంతమైన 21 సెంచరీల రికార్డును సైతం కోహ్లీ అధిగమించడం గమనార్హం. 21 టెస్ట్‌ శతకాలకు సచిన్‌ 110 ఇన్నింగ్స్‌లు ఆడగా, కోహ్లీ అప్పుడు కూడా కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ తక్కువ(109 ఇన్నింగ్స్‌)లో ఈ ఫీట్‌ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top