క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

Venugopal Rao Announces Retirement from All Forms of Cricket  - Sakshi

సాక్షి, విశాఖపట్నం : భారత మాజీ క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు వై.వేణుగోపాల రావు (37) ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. 2017 అక్టోబరులో ఆంధ్ర, తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌ ఆడిన తర్వాత రెండేళ్లుగా వేణుగోపాలరావు మళ్లీ బరిలోకి దిగలేదు. క్రికెట్‌ కామెంటేటర్‌గా కూడా కొనసాగుతున్న వేణు... ఇటీవలి ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన వేణుగోపాలరావు అంతర్జాతీయ కెరీర్‌ మాత్రం సంతృప్తికరంగా సాగలేదు.

2005 జులైలో తొలి వన్డే ఆడిన అతని కెరీర్‌ పది నెలల వ్యవధిలోనే 16 వన్డేలకే (ఆరు వేర్వేరు జట్లపై కలిపి) పరిమితమైంది. వేణుగోపాలరావు అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఏకైక అర్ధ సెంచరీ (93 బంతుల్లో 61 నాటౌట్‌) పాకిస్తాన్‌పై అబుదాబిలో సాధించాడు. దక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున కలిపి వేణు ఐపీఎల్‌లో మొత్తం 65 మ్యాచ్‌లు (2008–2014) ఆడాడు. ప్రధానంగా విజయ్‌ హజారే ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, చాలెంజర్‌ ట్రోఫీలో రాణించడంతో అతనికి వన్డే టీమ్‌ పిలుపు దక్కినా... అంతకుముందు ఇంగ్లండ్‌ ‘ఎ’తో జరిగిన ఫస్ట్‌ క్లాస్‌మ్యాచ్‌లో చేసిన అద్భుత బ్యాటింగ్‌ వేణుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 501 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేణు అజేయంగా 228 పరుగులు చేయడం విశేషం.  


ఆంధ్ర క్రికెట్‌కు సంబంధించి మాత్రం వేణుగోపాలరావుకు ప్రత్యేక స్థానం ఉంది. జూనియర్‌ క్రికెట్‌తో పాటు 19 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో అతను ఎన్నో సార్లు తన జట్టుకు కీలక విజయాలు అందించాడు. కెరీర్‌ చివర్లో వేర్వేరు కారణాలతో ఆంధ్ర జట్టుకు దూరమైన అతను రంజీల్లో గుజరాత్, రాజస్తాన్‌ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్‌ సందర్భంగా వేణుగోపాలరావును అభినందించి అతని సేవలను ప్రశంసించిన ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అతను భవిష్యత్తులో ఏ రంగంలోనైనా మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top