మరో స్వర్ణంపై సురేఖ గురి

Vennam Jyothi Surekha Finished Second In The Gold Medal Race - Sakshi

మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో ఫైనల్‌కు అర్హత

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌

బ్యాంకాక్‌: మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కనబరిచిన ప్రదర్శనను మహిళల టీమ్‌ విభాగంలోనూ పునరావృతం చేయడంతో... ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణ పతకం రేసులో నిలిచింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మతో కలిసి ఇప్పటికే ఫైనల్‌ చేరిన జ్యోతి సురేఖ... మంగళవారం జరిగిన మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో ముస్కాన్‌ కిరార్, ప్రియా గుర్జర్‌లతో కలిసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.

భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం ఉండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. మహిళల టీమ్‌ కాంపౌండ్‌ సెమీఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియ బృందం 229–221తో సయ్యదా, ఫార్సి, అరెజులతో కూడిన ఇరాన్‌ జట్టును ఓడించింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లో 226–225తో కన్యవీ, కనోక్‌నాపుస్, నారెయుమోన్‌లతో కూడిన థాయ్‌లాండ్‌ జట్టుపై గెలిచింది. నేడు జరిగే టీమ్‌ ఫైనల్లో కొరియాతో భారత్‌ తలపడుతుంది. ఈ ఫైనల్‌ తర్వాత మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ తుది పోరులో సురేఖ–అభిõÙక్‌ వర్మ జంట చైనీస్‌ తైపీకి చెందిన యి సువాన్‌ చెన్‌–చియె లున్‌ చెన్‌ జోడీతో ఆడుతుంది.  

మూడు కాంస్యాలు...
మంగళవారం భారత ఆర్చర్లు మూడు కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో అతాను దాస్‌ 6–5తో జిన్‌ హాయెక్‌ ఓ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అతాను దాస్, తరుణ్‌దీప్‌ రాయ్, జయంత తాలుక్‌దార్‌లతో కూడిన భారత జట్టు 6–2తో చైనాను ఓడించింది. మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగంకాంస్య పతక మ్యాచ్‌లో దీపిక కుమారి, బొంబేలా దేవి, అంకితలతో కూడిన భారత జట్టు 5–1తో జపాన్‌పై గెలిచింది. పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో అభిõÙక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, మోహన్‌ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో భారత్‌ 229–221తో ఇరాన్‌పై గెలిచి నేడు జరిగే ఫైనల్లో కొరియాతో పోరుకు సిద్ధమైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top