
దవడ గాయంతో ఉన్ముక్త్ (ఇన్‌సెట్‌లో).. బ్యాటింగ్ (ఫైల్)
న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెటర్, అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అసమాన పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగిన ఈ యువ బ్యాట్స్‌మన్ సెంచరీ సాధించాడు. ఒకపక్క గాయం బాధ పెడుతున్నా ఓర్చుకుని జట్టుకు భారీ స్కోరు అందించి విజయంలో కీలక భూమిక పోషించాడు.
దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఉన్ముక్త్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. యూపీ 45.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఉన్ముక్త్ గాయపడ్డాడు. బంతి బలంగా తగలడంతో అతడి దవడకు తీవ్రగాయమైంది. నొప్పిని లెక్కచేయకుండా ముఖానికి కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌కు దిగాడు. అతడి పోరాటస్ఫూర్తికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు అనిల్ కుంబ్లేను గుర్తు చేసుకున్నారు. 2002లో ఆంటిట్వాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తలకు గాయమైనా కుంబ్లే కట్టు కట్టుకుని బౌలింగ్ చేశాడు. అంతేకాదు డేంజరస్ బ్యాట్స్‌మన్ బ్రియన్ లారా వికెట్ పడగొట్టాడు.