‘బెంగ’ తీరేనా..? | today Gujarat lions face Royal Challengers | Sakshi
Sakshi News home page

‘బెంగ’ తీరేనా..?

Apr 26 2017 11:20 PM | Updated on Aug 21 2018 2:46 PM

‘బెంగ’ తీరేనా..? - Sakshi

‘బెంగ’ తీరేనా..?

గతేడాది అప్రతిహత విజయాలతో రన్నరప్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన

నేడు గుజరాత్‌తో తలపడనున్న రాయల్‌ చాలెంజర్స్‌
ఒత్తిడిలో కోహ్లిసేన.. అట్టడుగు స్థానంలో లయన్స్‌


బెంగళూరు: గతేడాది అప్రతిహత విజయాలతో రన్నరప్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈక్రమంలో పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాత్‌ లయన్స్‌తో గురువారం తలపడనుంది. ఎలాగైనా తిరిగి విజయాల బాట ఎక్కాలని కోహ్లిసేన భావిస్తుండగా..  పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని గుజరాత్‌ యోచిస్తోంది.

బెంగళూరుకు చావోరేవో...
టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఇప్పటివరకు కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియగా.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈక్రమంలో ఐదు పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు చేతిలో ఇంకా ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచి ప్రతీమ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి.

ఇలాగైతేనే ఆ జట్టు నాకౌట్‌ రేసులో నిలుస్తుంది. మరోవైపు కోహ్లి, క్రిస్‌ గేల్, ఏబీ డివిలియర్స్‌ లాంటి భీకర బ్యాట్స్‌మెన్‌తో కూడిన బెంగళూరు.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 132 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా ఛేదించలేదు. అత్యంత అవమానకరంగా 49 పరుగులకే కుప్పకూలింది. పదేళ్ల టోర్నీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. జట్టులోని ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అయితే బెంగళూరు ఆడిన చివరిమ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది. ఈక్రమంలో ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్‌ను కోహ్లిసేన చావో రేవో అని భావించి ఆడాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌ విషయానికొస్తే పేపర్‌ చాలా బలంగా కన్పిస్తోన్న బెంగళూరు.. మైదానంలో మాత్రం తడబడుతోంది. జట్టు కీలక ఆటగాళ్లు కోహ్లి (154 పరుగులు), గేల్‌ (144 పరుగులు), డివిలియర్స్‌ (145 పరుగులు) ఫర్వాలేదనిపిస్తున్నారు. బెంగళూరు తిరిగి విజయాల బాట పట్టాలంటే ఈ ముగ్గురు గర్జించాల్సి ఉంటుంది. కేదార్‌ జాదవ్‌ 175 పరుగులతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మన్‌దీప్‌ సింగ్,  స్టువర్ట్‌ బిన్నీ రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది.

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే ఈ విభాగం సాదాసీదా కన్పిస్తోంది. స్పిన్నర్‌ యజ్వెంద్ర చహల్‌ జట్టు తరఫున పది వికెట్లతో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. పవన్‌ నేగి, శామ్యూల్‌ బద్రీ చెరో ఆరు వికెట్లతో ఫర్వాలేదనిపిస్తున్నారు. శ్రీనాథ్‌ అరవింద్, స్టువర్ట్‌ బిన్నీ బంతితో సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు ఈ సీజన్‌లో ఇరుజట్లు పరస్పరం తలపడగా అందులో బెంగళూరు విజయం సాధించింది. గేల్, కోహ్లి దూకుడుతో భారీస్కోరు సాధించిన బెంగళూరు.. రైనాసేనపై అద్భుత విజయం సాధించింది. మరోసారి అలాంటి ప్రదర్శన చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.

నిరాశలో గుజరాత్‌..
గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్‌ లయన్స్‌ టోర్నీలో మూడోస్థానం పొంది అకట్టుకుంది. అయితే ఈసారి మాత్రం గుజరాత్‌ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌.. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన లయన్స్‌ కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. జట్టులో కెప్టెన్‌ సురేశ్‌ రైనా, బ్రెండన్‌ మెకల్లమ్‌ , దినేశ్‌ కార్తిక్‌ రాణిస్తున్నారు. అయితే వీరికి ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం అందడం లేదు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో పోరాడి ఓడిపోయారు. జట్టులో రైనా 275 పరుగులతో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మెకల్లమ్, కార్తిక్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే ఆరోన్‌ ఫించ్, డ్వేన్‌ స్మిత్‌ విఫలమవడం జట్టును కలవరపరుస్తోంది. మరోవైపు స్వదేశీ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్, రవీంద్ర జడేజా తమ బ్యాట్లకు పనిచెప్పల్సిన అవసరముంది. ఇక గుజరాత్‌ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌ ప్రతిభతోనే నెగ్గింది. ఈ సీజన్‌లో అత్యంత బలహీన బౌలింగ్‌ లైనప్‌ ఉన్న జట్టు గుజరాత్‌ అనడంలో సందేహంలేదు.

ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన రైనాసేన కేవలం 26 వికెట్లను మాత్రమే తీయగలిగింది. బౌలర్లలో అండ్రూ టై , కేరళ పేసర్‌ బాసిల్‌ థంప్సి ఆకట్టుకుంటున్నారు. నాలుగు మ్యాచ్‌ల నుంచి తొమ్మిది వికెట్లు తీసిన టై జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. దేశవాళీ బౌలర్లైన ప్రవీణ్‌ కుమార్, జడేజా ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఐదు మ్యాచ్‌లాడిన జడేజా కేవలం రెండు వికెట్లను మాత్రమే తీశాడు. శుభమ్‌ అగర్వాల్, నాథూ సింగ్‌ తదీతరులు విఫలమవుతున్నారు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన డ్వేన్‌ బ్రావో స్థానంలో ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ బరిలోకి దిగనున్నాడు.

ఈ సీజన్‌ వేలంలో అమ్ముడుపోని ఇర్ఫాన్‌ను గుజరాత్‌ జట్టులోకి తీసుకుంది. పేస్‌ బౌలింగ్‌తోపాటు లోయర్‌ అర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మన్‌గా ఇర్ఫాన్‌ ఉపకరిస్తాడు. గత సీజన్లన్నీ కలిపి 102 మ్యాచ్‌లాడిన ఇర్ఫాన్‌ అనుభవం జట్టుకు ఉపయోగపడగలదు. గతేడాది ఇరుజట్లు రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో బెంగళూరు నెగ్గింది కనుక ఈ మ్యాచ్‌లో తాము విజయం సాధించే అవకాశముందనే అత్మవిశ్వాసంతో జట్టు బరిలోకి దిగనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement