పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్‌ పైన్‌ | Tim Paine Sledges Rishabh Pant | Sakshi
Sakshi News home page

Dec 28 2018 1:29 PM | Updated on Dec 28 2018 1:58 PM

Tim Paine Sledges Rishabh Pant - Sakshi

గిల్లీ కజ్జాలు పెట్టుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదేమో!

మెల్‌బోర్న్‌ : గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదేమో! భారత్‌తో సిరీస్‌కు ముందు తాము మారిపోయామని సుద్దపూస మాటలు చెప్పిన ఆసీస్‌ ఆటగాళ్లు.. ఆచరణలో మాత్రం దాన్ని చూపించడం లేదు. తొలి టెస్ట్‌ నుంచే మాటలతో రెచ్చగొడుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ వచ్చిన ఆటగాళ్లు.. తాజాగా మూడో టెస్ట్‌లో కూడా అదే తరహా ప్రవర్తనను కనబర్చారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నోటికెంత వస్తే అంత మాట్లాడుతూ భారత ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. రెండో రోజు ఆటలో రోహిత్‌ సిక్స్‌ కొడితే.. ముంబైజట్టుకు మారిపోతానని కవ్వించిన పైన్‌.. మూడో రోజు ఆటలో వికెట్‌ కీపర్‌ పంత్‌ను టార్గెట్‌ చేస్తూ నోరుపారేసుకున్నాడు.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్‌ చేస్తున్న పంత్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ రెచ్చగొట్టాడు. ఆసీస్‌తో జరిగే వన్డే జట్టులో చోటు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ‘పంత్‌.. ధోని వచ్చేశాడు కదా..ఏం చేస్తావ్‌.. బీబీఎల్‌లో హరికేన్స్‌ జట్టు తరఫున ఆడుతావా?’ అంటూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీన్ని ఏమాత్రం పట్టించుకోని పంత్‌ తనపని తాను చేసుకుంటూ పోయాడు. పైన్‌ వ్యాఖ్యలు స్టంప్స్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. 

ఇక తొలిటెస్ట్‌లో కమిన్స్‌కు దీటుగా పంత్‌ స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్‌ ఆటగాళ్లు ఎంత రెచ్చగొడుతున్నా.. భారత ఆటగాళ్లు సహనం ప్రదర్శించడం వల్ల వివాదాస్పదం కావడం లేదు కానీ.. వారికి దీటుగా స్పందిస్తే మైదానంలో పెద్ద గొడవలే జరుగుతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా చేష్టలతోనే బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని చేతులు కాల్చుకున్నా.. ఆసీస్‌ ఆటగాళ్లకు బుద్ది రావడం లేదని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement