టీమిండియాతో ఓడిపోవడమే..

Test series Loss Against India Made Me As Coach, Justin Langer - Sakshi

మెల్‌బోర్న్‌: 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌ను  కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీమిండియా 2-1తో సిరీస్‌ను సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియాపై వారి దేశంలో తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలిచి కోహ్లి సేన కొత్త చరిత్ర నెలకొల్పింది. అయితే ఆసీస్‌ స్వదేశంలో సిరీస్‌ ఓడిపోవడం తనకు ఒక పెద్ద గుణపాఠమని అంటున్నాడు ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌. (లాక్‌డౌన్‌ ముగిస్తే నేను ఇంటికి రానే రాను)

తన కోచింగ్‌  కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన అనుభవాలను లాంగర్‌ షేర్‌ చేసుకున్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లు ఏడాది పాటు నిషేధానికి గురి కాగా, అదే సమయలో లాంగర్‌ కోచింగ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటివరకూ లీమన్‌ కోచ్‌గా ఉండగా ఆ స్థానంలో లాంగర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పారు.  ఆ తర్వాత టీమిండియాతో  జరిగిన టెస్టు సిరీస్‌ను ఆసీస్‌ సొంత గడ్డపై కోల్పోవడం ఒక మేలుకొలుపు లాంటిదని లాంగర్‌ అభివర్ణించాడు. తాను కోచ్‌గా పటిష్టంగా మారడానికి భారత్‌తో సిరీస్‌ను కోల్పోవడమే ప్రధాన కారణమన్నాడు.  
 
‘భార‌త్ చేతిలో సిరీస్ ఓట‌మి..నా జీవితంలో చాలా క్లిష్ట‌మైన స‌మ‌యం. సొంత‌గ‌డ్డ‌పై ప‌రాజయం కోచింగ్ కెరీర్‌లో నాకో మేలుకొలుపు లాంటిది. ఇంకో పదేండ్ల త‌ర్వాత ఒక్క‌సారిగా వెనుతిరిగి చూసుకుంటే నా కెరీర్ ఎలా మొద‌లైందో చూసుకోవ‌చ్చు. దీనికి తోడు 2001లో న‌న్నుజ‌ట్టు నుంచి త‌ప్పించారు. 31 ఏండ్ల వ‌య‌సులో ఇక నా ప‌ని అయిపోయింద‌నుకున్నా. క్లిష్ట‌మైన ప‌రిస్థితులే జీవితంలో ఎలా నిల‌దొక్కుకోవాలో నేర్పిస్తాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ సమస్యను చూడండి. ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. మనం పాఠాలు నేర్చుకుని ఎలా గాడిన పడాలనేది గుర్తిస్తే.. అద్భుత‌మైన వ్య‌క్తిగా మారేందుకు అవ‌కాశం ల‌భిస్తుంది’లాంగ‌ర్ అన్నాడు. (కరోనా వ్యాక్సిన్‌ వచ్చాకే... మైదానాలకు వస్తాం!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top