ఆట లేకున్నా... అదృష్టం తోడై!

Sweden squeaks out narrow win over Switzerland - Sakshi

 1–0తో స్విట్జర్లాండ్‌పై  స్వీడన్‌ విజయం  

ఏకైక గోల్‌ చేసిన ఫోర్స్‌బెర్గ్‌

ఓవైపు పెనాల్టీ షూటౌట్‌లు... మరోవైపు పోటాపోటీ గణాంకాలతో సాగుతున్న ప్రపంచ కప్‌ నాకౌట్‌లో భిన్న పోరాటం! ఒకటికి నాలుగు గోల్స్‌ నమోదవుతున్న తీరుకు విరుద్ధంగా ఏకైక గోల్‌తోనే తేలిపోయిన ఫలితం! ఆటపై ఆసాంతం ఆధిపత్యం ఒక జట్టుదైతే... గెలుపు మాత్రం ఇంకో పక్షం ఖాతాలో చేరింది.! స్విట్జర్లాండ్‌ ఉసూరంటూ నిష్క్రమించగా... గండం గట్టెక్కిన స్వీడన్‌ క్వార్టర్స్‌ గడపతొక్కింది.  

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: అయ్యో... స్విట్జర్లాండ్‌! 64 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకుని... ప్రత్యర్థిపై దాడుల్లోనూ మెరుగ్గా నిలిచినా... ఫలితాన్ని మాత్రం పొందలేకపోయింది. తమకంటే (6) నాలుగింతలు తక్కువ ర్యాంకున్న స్వీడన్‌ (24)కు మ్యాచ్‌ను చేజార్చుకుంది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన ప్రి క్వార్టర్స్‌ పోటీలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫోర్స్‌బెర్గ్‌ (66వ నిమిషం) ఏకైక గోల్‌తో 1–0తో స్వీడన్‌ నెగ్గి 1994 తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. బంతి ప్రత్యర్థికి చిక్కకూడదు అన్నట్లు ఆడింది స్విట్జర్లాండ్‌. స్వీడన్‌ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించినా మ్యాచ్‌ ఏ దశలోనూ పట్టు సడలించలేదు. మార్కస్‌ బెర్గ్‌ గోల్‌ కొట్టిన వాలీని స్విస్‌ కీపర్‌ యాన్‌ సోమర్‌ కొనవేళ్లపై అద్భుతంగా నిలువరించగా, ఆల్బిన్‌ ఎక్దాల్‌ షాట్‌ గోల్‌పోస్ట్‌ బార్‌పై నుంచి వెళ్లింది.

టోర్నీలో రక్షణాత్మకంగా ఆడుతున్న స్వీడన్‌... స్విస్‌ స్టార్‌ షకిరిని కట్టడి చేసింది. మొదటిభాగం ముగిసేసరికి బంతి 65 శాతం స్విస్‌ పరిధిలోనే ఉంది. ఇరు జట్లకూ అవకాశాలు దక్కడంతో రెండో భాగం ఆసక్తికరంగా  ప్రారంభమైంది. స్విట్జర్లాండ్‌ ఒత్తిడి పెంచింది. అయితే, 66వ నిమిషంలో స్వీడన్‌కు అదృష్టం కలిసొచ్చింది. కార్నర్‌ నుంచి టొవొనెన్‌ ఇచ్చిన పాస్‌ను సరిగ్గా డి బాక్స్‌లో అందుకున్న ఫోర్స్‌బెర్గ్‌ గోల్‌పోస్ట్‌ దిశగా గట్టిగా కొట్టాడు. దీనికి స్విస్‌ ఆటగాడు అకంజి అడ్డురాగా... బంతి అతడి కాలికి తగిలి బౌన్స్‌ అయి నెట్‌లో పడింది. 0–1తో వెనుకబడిన తర్వాత స్విట్జర్లాండ్‌ పరిస్థితిని గమనించి ఇద్దరు సబ్‌స్టిట్యూట్‌లను బరిలో దింపింది. గోల్‌ చేసేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది.  

ప్రపంచకప్‌లో స్వీడన్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందడం 1958 తర్వాత ఇదే తొలిసారి. ఆతిథ్య దేశం హోదాలో స్వీడన్‌ 1958 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్, సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో బ్రెజిల్‌ చేతిలో ఓడిపోయింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top