2 నిమిషాల 33 సెకన్లలో పసిడి! | Sakshi
Sakshi News home page

2 నిమిషాల 33 సెకన్లలో పసిడి!

Published Sat, Nov 18 2017 11:15 AM

Sushil 'Walks Over' to a Gold - Sakshi

ఇండోర్: జాతీయ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్‌ పతక విజేతలు సుశీల్‌ కుమార్‌, సాక్షి మాలిక్‌ తోపాటు గీతా ఫొగట్‌ తమతమ విభాగాలలో స్వర్ణాలు సాధించారు. మూడేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన సుశీల్‌కు ఎదురే లేకపోయింది. ఈ చాంపియన్ షిప్ లో 74 కేజీల విభాగంలో రైల్వేస్ తరపున బరిలోకి దిగిన సుశీల్ కుమార్ కు మూడు వాకోవర్ల లభించడంతో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఫైనల్ కు చేరిన ప్రవీణ్ రాణా గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకోవడంతో సుశీల్ కు స్వర్ణం ఖాయమైంది. అంతకుముందు క్వార్టర్స్, సెమీస్ ల్లో కూడా 34 ఏళ్ల సుశీల్ కు వాకోవర్ లభించింది.

అతడు ఆరంభ రౌండ్లలో ప్రత్యర్ధులను నిమిషంలోపే చిత్తుచేయగా, ఆపై వరుసగా మూడు వాకోవర్లు దక్కాయి. దాంతో ఈ విభాగంలో సుశీల్ విజేతగా నిలిచి పసిడిని దక్కించుకున్నాడు. మొత్తంగా స్వర్ణ సాధనలో సుశీల్‌ అన్ని రౌండ్లలో కలిపి 2 నిమిషాల 33 సెకన్లు మాత్రమే పోరాడడం గమనార్హం. మరొకవైపు సాక్షి మాలిక్, గీతా పొగట్ లు తమతమ విభాగాల్లో పసిడి పతకాలు సాధించారు.

Advertisement
Advertisement