‘ఇదెక్కడి ఔట్‌.. నేనెప్పుడూ చూడలేదు’

Steve Smith Bizarre Dismissal In First Class Cricket - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన ఈ ఆసీస్‌ మాజీ సారథి.. తాజాగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ సెంచరీ సాధించాడు. ఇది అతడికి 42వది కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్‌ చేసిన స్మిత్‌ తన కెరీర్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీ(290 బంతుల్లో) చేసిన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో యాషెస్‌ సిరీస్‌లో 261 బంతుల్లో సెంచరీ చేసి ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించిన విషయం తెలిసిందే. కాగా వెస్ట్రన్‌ ఆసీస్‌పై సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్‌ అనూహ్యంగా అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. 

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ వేసిన బంతిని స్మిత్‌ అప్పర్‌ కట్‌ అడబోయాడు. అయితే స్మిత్‌ అంచనా తప్పడంతో షాట్‌ ఫెయిల్‌ అయి బంతి బ్యాట్‌కు తగలకుండానే వికెట్ల వెనకాలే ఉన్న కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ చేతుల్లోకి వెళ్లింది. అయితే వికెట్‌ కీపర్‌ అవుట్‌ కోసం అప్పీల్‌ చేశాడు. అనూహ్యంగా అంపైర్‌ స్మిత్‌ అవుటని ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన స్మిత్‌ భారంగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ‘ఇదెక్కడి ఔట్‌.. నేనెప్పుడూ​ చూడలేదు’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘స్మిత్‌ బ్యాటింగ్‌తో నిద్ర పోయిన అంపైర్‌కు అప్పుడే మెలుకువ వచ్చినట్టుంది’అంటూ మరికొంత మంది సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. కాగా, స్మిత్‌ ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు టెస్టుల్లో 774 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో నిషేధానికి గురైన స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌తో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top