ఎవరీ మిల్‌మన్‌? 

Special story to  John Millman - Sakshi

యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఎనిమిది మందిలో 29 ఏళ్ల జాన్‌ మిల్‌మన్‌ ఒక్కడే అన్‌సీడెడ్‌.  కెరీర్‌లో ఒక్కసారి కూడా టాప్‌–10 ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్లని ఓడించలేకపోయిన మిల్‌మన్‌ ఈసారి ఏకంగా ఫెడరర్‌నే ఇంటిదారి పట్టించాడు. వింబుల్డన్‌కు ముందు కొన్ని నెలల పాటు ఫెడెక్స్‌ ఆహ్వానంపైనే స్విట్జర్లాండ్‌కు వెళ్లి అతనికి ప్రాక్టీస్‌ పార్ట్‌నర్‌గా మిల్‌మన్‌ కలిసి ఆడటం విశేషం. ఇప్పటి వరకు ఒక్క ఏటీపీ టైటిల్‌ కూడా నెగ్గని అతనికి గత ఏప్రిల్‌లో హంగేరి ఓపెన్‌ ఫైనల్‌ చేరడమే సర్క్యూట్‌లో అత్యుత్తమ ప్రదర్శన. కెరీర్‌లో ఎక్కువ భాగం గాయాలతోనే ఇబ్బంది పడ్డాడు. 2013లో భుజానికి పెద్ద శస్త్రచికిత్స జరగడంతో తర్వాతి ఏడాది ర్యాంకుల్లో 1,193కి పడిపోయాడు. ఆ తర్వాత నిలకడగా రాణిస్తున్న దశలో తుంటి గాయానికి మరో సర్జరీ జరిగింది. ఈ దశలో ఆటనుంచి దాదాపుగా తప్పుకోవాలని నిర్ణయించుకున్న అతను ఒక ఆఫీసులో 9–5 ఉద్యోగంలో కూడా చేరిపోయాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా ఆ సమయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కొన్నాడు. అయితే పోరాటం విడవకుండా మళ్లీ ఆటలోకి అడుగు పెట్టాడు. అతని స్వస్థలం బ్రిస్బేన్‌. ఐదుగురు సభ్యుల కుటుంబంలో మిగతా నలుగురు అమ్మాయిలే. ఏడాది క్రితం 235వ ర్యాంక్‌లో ఉన్న మిల్‌మన్‌ ఇప్పుడు మరో సంచలనంపై దృష్టి పెట్టాడు. క్వార్టర్‌ ఫైనల్లో మిల్‌మన్‌ మరో దిగ్గజం జొకోవిచ్‌తో తలపడనున్నాడు. మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా వచ్చే సోమవారం అతను కెరీర్‌లో అత్యుత్తమంగా 37వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. కనీసం 6 లక్షల 60 వేల డాలర్లు (దాదాపు రూ. 4 కోట్ల 72 లక్షలు) అతని ఖాతాలో చేరుతాయి.  

నా విజయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఫెడరర్‌ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నా హీరో అతను. ఈ రోజు అతనిది కాకపోవచ్చు. అంతే! కానీ అలాంటి అవకాశం నాకు కలిసొచ్చింది. దానిని ఒడిసి పట్టుకున్నాను. ఈ క్షణాన్ని చిరకాలం గుర్తుంచుకుంటాను.                 
– జాన్‌ మిల్‌మన్‌ 

ఈ రాత్రి చాలా చాలా వేడిగా ఉంది. కొన్ని సార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా నాకు కష్టంగా అనిపించింది. అందుకే చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ ఉక్కపోత ఉండే బ్రిస్బేన్‌నుంచి రావడం వల్ల కావచ్చు మిల్‌మన్‌కు సమస్య కాలేదు. నాకు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఉదయం పూట నేను ఆడాను. కొన్నిసార్లు మన శరీరం సహకరించకపోవచ్చు. మ్యాచ్‌ ముగిసినందుకు ఒకింత సంతోషించాను కూడా. మ్యాచ్‌ చాలా కఠినంగా సాగింది. రెండో సెట్‌ కూడా గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. జాన్‌ చాలా అద్భుతంగా ఆడాడు.    
– రోజర్‌ ఫెడరర్‌    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top