ఏమీ మారలేదు... ఏమీ చెప్పలేను 

Sourav Ganguly Speaks About On Performance Of IPL 2020 - Sakshi

ఐపీఎల్‌–13 నిర్వహణపై గంగూలీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రపంచం, దేశం మాటలకందని విలయంతో విలవిల్లాడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఆటలకేం చోటుంటుంది? ఇప్పుడైతే దేశమే మూతపడింది. వేలకోట్లు వెచ్చించిన టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలే ఆగిపోయాయి. అయినా సరే ఐపీఎల్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాత్రం ఇంకా తేల్చకుండా... నాన్చుడు ధోరణే కనబరిచాడు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వూ్యలో అతను మాట్లాడుతూ ‘ఈ సమయంలో ఏమీ చెప్పలేను. లీగ్‌ను వాయిదా వేసినప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా లేదు. ఏమీ మారలేదు. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు.

యథాతథస్థితే కొనసాగుతుంది’ అని అన్నాడు. ప్రభుత్వమే లాక్‌డౌన్‌ చేసిన ఈ విపత్కర పరిస్థితుల్లో లీగ్‌కు బీమా సొమ్ము వస్తుందన్న ఆశ కూడా లేదన్నాడు. మరో మూణ్నాలుగు నెలల తర్వాతైనా నిర్వహించే అవకాశం లేదన్నాడు. ఎందుకంటే భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ఎప్పుడో ఖరారైందని... దాన్ని మార్చడం అసాధ్యమన్నాడు. ప్రభుత్వం కోరితే ఈడెన్‌ గార్డెన్‌ ఇండోర్‌ సదుపాయాల్ని వైద్య అవసరాల కోసం ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పాడు.

కోల్‌కతాను ఇలా చూస్తాననుకోలేదు... 
‘మా నగరాన్ని ఇలా చూస్తానని నేనెపుడూ అనుకోలేదు. ఈ పరిస్థితి త్వరలోనే మెరుగవుతుంది. మీరైతే సురక్షితంగా ఉండండి. జాగ్రత్తలు తీసుకోండి. మీ అందరిపై నా  ప్రేమాభిమానాలు ఉంటాయి’ అని ‘దాదా’ ట్వీట్‌ చేశాడు. కాళీమాతా ఉండే కోల్‌కతా... ఇప్పుడంతా ఖాళీగా కనిపించడంతో గంగూలీ ట్విట్టర్‌లో స్పందించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top