మరో ఏడుగురు పాక్‌ క్రికెటర్లకు కరోనా

Seven More Pakistan Cricketers Have Coronavirus Positive - Sakshi

మొత్తం పది మందికి పాజిటివ్‌

అయినా యథావిధిగా ఇంగ్లండ్‌ పర్యటన

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు కోవిడ్‌–19 దెబ్బ గట్టిగా తగిలింది. ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన పాక్‌ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... ఇప్పుడు మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్‌గా తేలారు. దీంతో కరోనా బారిన పడిన ఆటగాళ్ల సంఖ్య పదికి చేరింది. తాజాగా ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో మొహమ్మద్‌ హఫీజ్, వహాబ్‌ రియాజ్, ఫఖర్‌ జమాన్, మొహమ్మద్‌ రిజ్వాన్, మొహమ్మద్‌ హస్‌నైన్, కాశిఫ్‌ భట్టీ, ఇమ్రాన్‌ ఖాన్‌లకు కరోనా వచ్చినట్లు బయటపడింది.  ఈ ఏడుగురు ఆటగాళ్లు కూడా ఫలితాలు వచ్చేవరకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఎసింప్టమిక్‌గానే కనిపించారు. షోయబ్‌ మాలిక్, కోచ్‌ వకార్‌ యూనిస్‌ తదితరుల పరీక్షా ఫలితాలు కూడా రావాల్సి ఉంది. సోమవారం షాదాబ్‌ ఖాన్, హైదర్‌ అలీ, హారిస్‌ రవూఫ్‌లకు పాజిటివ్‌ ఫలితం వచ్చింది.

ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం 29 మందితో భారీ జట్టును పాక్‌ ప్రకటించగా... ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించింది. పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్‌. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్‌ గైర్హాజరులో మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లు బిలాల్‌ ఆసిఫ్, ఇమ్రాన్‌ బట్, మూసా ఖాన్, మొహమ్మన్‌ నవాజ్‌లను ఎంపిక చేసిన పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది. జూన్‌ 25న పాక్‌ ఆటగాళ్లకు తర్వాతి దశ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top