జైత్రయాత్రికుడు

Serbias star Novak Djokovic is back in the mens tennis - Sakshi

 ఐదోసారి సీజన్‌ను నంబర్‌వన్‌

ర్యాంక్‌తో ముగించనున్న జొకోవిచ్‌ ఇక ఫెడరర్‌ ‘గ్రాండ్‌’ 20 టైటిళ్ల  రికార్డుపైనే గురి  

సాక్షి క్రీడా విభాగం:‘ఇంటి’ సమస్యలను చక్కదిద్దుకుని... ఆటపై ఏకాగ్రత పెంచుకుని... సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ పురుషుల టెన్నిస్‌లో మళ్లీ పూర్వ వైభవం సాధించాడు. మంచి ఊపు మీద ఉండీ... వివిధ కారణాలతో 2016లో చేజార్చుకున్న టాప్‌ ర్యాంకును తిరిగి అందుకున్నాడు. ఈ పునరాగమనాన్ని మరింత ఘనంగా మలుచుకునేందుకా అన్నట్లు... స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డుపై గురి పెట్టాడు. తన కెరీర్‌లో ముందున్న పెద్ద లక్ష్యం అదేనంటూ... ఐదోసారి టెన్నిస్‌ సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనున్న సందర్భంగా అతను ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. 

రాత మార్చిన 2018... 
31 ఏళ్ల జొకోవిచ్‌కు సీజన్‌ ముగింపులో నంబర్‌వన్‌గా నిలవడం కొత్తేమీ కాదు. 2011, 2012, 2014, 2015లోనూ అతడీ స్థానాన్ని చేరుకున్నాడు. ఈసారిదే మరింత ప్రత్యేకం. ఫిబ్రవరిలో మోచేయి శస్త్రచికిత్స నాటికి... జొకో అసలు మళ్లీ కోర్టులో కనిపిస్తాడా? అన్నంతగా ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ, ఒక్కోటిగా వాటన్నిటినీ చక్కదిద్దుకుని అనూహ్యంగా గాడినపడ్డాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో దుమ్మురేపాడు. వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గాడు. 14 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో సంప్రాస్‌ను సమం చేశాడు. మాస్టర్స్‌ సిరీస్‌లో భాగంగా మొత్తం తొమ్మిది టైటిల్స్‌ నెగ్గిన తొలి ఆటగాడిగానూ అవతరించి ఈ ప్రస్థానాన్ని మరుపురానిదిగా మలచుకున్నాడు.   

ఇంటిని చక్కబెట్టుకుని... 
ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. జొకో దీనినే పాటించాడు. భార్యతో విభేదాలు, కోచ్‌లతో సమస్యలను పరిష్కరించుకున్నాడు. ఎటువంటి ఆలోచనలు లేకుండా తాజాగా బరిలో దిగాడు. సహజంగానే వ్యూహాత్మకత, సాంకేతికతలో ప్రస్తుత తరంలో మేటి ఆటగాడైన ‘జోకర్‌’కు దీంతో ఎదురులేకుండా పోయింది. వింబుల్డన్‌ నుంచి 34 మ్యాచ్‌లాడితే జొకో రెండే ఓడటం తన ఫామ్‌ను చాటుతోంది. దీనివెనుక తన పతనానికి కారణాలు కనుక్కొని వాటిని పరిష్కరించుకున్న అతడి పరివర్తనదే ముఖ్య పాత్ర అనడంలో సందేహం లేదు. 

‘20’ని అందుకుంటాడా? 
నంబర్‌వన్‌గా నిలిచిన ఆనందంలో చెప్పాడో, తన ఆటపై ధీమాతో చెప్పాడో కాని ఇప్పుడున్న వారిలో ఫెడరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును చేరుకోగలిగేది జొకోనే అన్నట్లుంది పరిస్థితి. వయసు ప్రభావంరీత్యా ‘ఫెడెక్స్‌’ మెరుపులు అప్పుడప్పుడే కనిపిస్తున్నాయి. గాయాల కారణంగా రాఫెల్‌ నాదల్‌ ఏ టోర్నీ ఆడతాడో తెలియదు. బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే పేరే ఈ మధ్య వినిపించడం లేదు. జ్వెరెవ్‌ (జర్మనీ), సిలిచ్‌ (క్రొయేషియా),  థీమ్‌ (ఆస్ట్రియా), ఇస్నెర్‌ (అమెరికా) తదితరులు ఈ సెర్బియా స్టార్‌కు అసలు పోటీనే కాదు. దీన్నిబట్టి చూస్తే ముందున్నది జొకో జైత్రయాత్రే. 

శుభారంభం...
లండన్‌: సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మాజీ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ శుభారంభం చేశాడు. కుయెర్టన్‌ గ్రూప్‌లో భాగంగా జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 6–4, 6–3తో జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా)పై గెలుపొందాడు. 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఆరు ఏస్‌లు సంధించాడు. ఇస్నెర్‌ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. మ్యాచ్‌ మొత్తంలో జొకోవిచ్‌ తన ప్రత్యర్థికి ఒక్క బ్రేక్‌ పాయింట్‌ అవకాశం కూడా ఇవ్వలేదు. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7–6 (7/5), 7–6 (7/1)తో సిలిచ్‌ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. లీటన్‌ హెవిట్‌ గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) 6–0, 6–1తో కీ నిషికోరి (జపాన్‌)ను చిత్తుగా ఓడించాడు. తొలి మ్యాచ్‌లో ఫెడరర్‌పై సంచలన విజయం సాధించిన నిషికోరి ఈసారి మాత్రం చేతులెత్తేశాడు.

►ఫెడరర్, కానర్స్‌ తర్వాత ఐదుసార్లు నంబర్‌ వన్‌గా సీజన్‌ ముగించిన మూడో ఆటగాడు జొకోవిచ్‌. సంప్రాస్‌ 6 సార్లు ఇలా చేశాడు.  

►ఫిబ్రవరిలో మోచేతికి శస్త్రచికిత్స. అప్పటికి ఇటు టైటిళ్ల వేటలో గాని, అటు ఆటలో పోటీ గురించి గాని అతడి గురించి చర్చే లేదు. కానీ, ఐదు నెలలకే అంతా తారుమారు. వరుసపెట్టి రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ కైవసం....  
ఈ అద్భుతం సాధించింది జొకోవిచ్‌!

►సగం సీజన్‌ వరకు 22వ ర్యాంకు. ముగింపునకు వచ్చేసరికి ప్రపంచ నంబర్‌వన్‌. టెన్నిస్‌ చరిత్రలో మరే ఆటగాడూ నమోదు చేయని రికార్డిది. ఇంకెవరి విషయంలోనూ ఊహించనిదిది.
ఈ ఘనతను సాధ్యం చేసింది జొకోవిచ్‌!

►ఫామేమో అనిశ్చితం. వ్యక్తిగత జీవితంలో కల్లోలం. శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నాడని ప్రచారం. అయినా, ఇవేవీ అడ్డు కాదంటూ, తన పనై పోలేదంటూ, నేనింకా ఉన్నానంటూ హెచ్చరికలాంటి సంకేతం.
ఈ గొప్పను అందుకున్నది జొకోవిచ్‌!  

►ఇదో గొప్ప సంతృప్తికర సీజన్‌. మళ్లీ నంబర్‌వన్‌గా నిలవడానికి కోచ్‌ మారియన్‌ వజ్దా, భార్య, సోదరుడు, అమ్మానాన్న అందించిన సహకారం మరువలేనిది. వీరే లేకుంటే దీనిని సాధించగలిగే వాడినే కాదు. టెన్నిస్‌లో నంబర్‌వన్‌గా నిలవడం అతి గొప్ప సవాల్‌. దీనిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు.     
-  జొకోవిచ్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top