
ఎడారిలో ధూమ్‌ధామ్
ఐపీఎల్ అంటే ఫోర్లు, సిక్సర్లు...ఐపీఎల్ అంటే వినోదానికి మారు పేరు... ఐపీఎల్ అంటే ఫిక్సింగ్‌లు, కేసులు...ఐపీఎల్ అంటే రాజీలు, రాజీనామాలు... ఎన్ని డ్రామాలు జరిగినా... ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా...
లీగ్ పండగొచ్చేసింది
కొత్త ఆటగాళ్లతో కళకళ
ఐపీఎల్ అంటే ఫోర్లు, సిక్సర్లు...ఐపీఎల్ అంటే వినోదానికి మారు పేరు... ఐపీఎల్ అంటే ఫిక్సింగ్‌లు, కేసులు...ఐపీఎల్ అంటే రాజీలు, రాజీనామాలు... ఎన్ని డ్రామాలు జరిగినా... ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా... విఘ్నాలను అధిగమించి మళ్లీ ఐపీఎల్ వచ్చేసింది. ఇక దాదాపు 45 రోజుల పాటు కావలసినంత టి20 వినోదం. ఏప్రిల్ 16న యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తొలి విడత ఐపీఎల్-7 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ కౌంట్‌డౌన్ నేటి నుంచి...
సాక్షి క్రీడా విభాగం
టి20ల్లో పుట్టుకొచ్చిన కొత్త తరహా షాట్‌ల మాదిరిగానే ఐపీఎల్ కొత్త రకం వివాదాలనూ పరిచయం చేసింది. ఫిక్సింగ్, బెట్టింగ్, చీర్‌గర్ల్స్, కోర్టు గొడవలు... ఇలా ఒకటేమిటి, సవాలక్ష అంశాలు లీగ్‌కు చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. మ్యాచ్‌లు జరిగే మైదానాలు మినీ బార్లుగా మారిపోతే... స్టార్ యజమానులు బౌండరీ లైన్ వద్దే గొడవలకు దిగారు. గత ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు లీగ్‌కు సంబంధించి జరిగిన పరిణామాలు చూస్తే ఈ టోర్నీకి ఆరేళ్లకే నూరేళ్లు నిండిపోతాయేమో అనిపించింది. కానీ... ఐపీఎల్ ఆగిపోయిందా... ఎవరైనా ఆటను వద్దనుకున్నారా... ప్రేక్షకులు మాకు ఇలాంటి వినోదం వద్దు అంటూ ఛీ కొట్టారా... లేదు...
ఎందుకంటే ఐపీఎల్ అందరికీ కావాలి. ఆటగాళ్లకు అదో అవసరం.
నిర్వాహకులకు హోదాకు సంబంధించిన వ్యవహారం. ఫ్రాంచైజీలకు పేరు ప్రతిష్టలు, ప్రచారంపై దృష్టి ఉంటే... స్పాన్సర్లకు వ్యాపారంపై దృష్టి. అన్నింటికి మించి సగటు అభిమానికి అమితమైన వినోదం కావాలి. మండు వేసవిలో పన్నీటి జల్లులా క్రికెట్ ఆనందం పంచాలి. ఫ్యాన్స్‌కు ఆట గురించే కాదు ఫిక్సింగ్ గురించీ, వివాదాల గురించీ తెలుసు. కానీ అవన్నీ వారు పట్టించుకోరు. అయితే ఏంటి... క్రికెట్ చూడకూడదా అని ఎదురు ప్రశ్నిస్తారు. క్రికెట్ బాగుంటే అన్నింటినీ క్షమించేస్తారు. సిక్సర్ల వినోదానికి భరోసా ఇవ్వగలితే మరో మాట లేకుండా మైదానం మొత్తం నిండిపోతుంది. ఇదే నిర్వాహకులకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. అందుకే ఈసారి మళ్లీ కొత్తగా ముస్తాబై మనల్ని అలరించేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చేస్తోంది.
ఆటంకాలను అధిగమించి...
గత ఏడాది ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు, ఆ తర్వాత బీసీసీఐలో జరిగిన మార్పులు, కోర్టు ఉత్తర్వులను బట్టి చూస్తే అసలు ఈసారి ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే సందేహం కూడా ఏర్పడింది. బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా లీగ్ రద్దుకు మద్దతు పలకడం విశేషం. ఈ సంవత్సర కాలంలో లీగ్‌కు సంబంధించిన పరిణామాల క్రమాన్ని పరిశీలిస్తే...
రాజుల కోటలో రచ్చ...
గత ఏడాది మే 16న స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతున్న ఐపీఎల్-6ను ఈ ఘటన కొత్త మలుపు తిప్పింది. అనంతర పరిణామాల్లో వారికి జ్యుడీషియల్ రిమాండ్, ఆ తర్వాత బెయిల్ లభించాయి. బీసీసీఐ ఈ ముగ్గురు ఆటగాళ్లపై జీవితకాల నిషేధం కూడా విధించింది.
యజమానుల పాత్ర...
పోలీసుల విచారణ ముందుకు సాగిన కొద్దీ కొత్త విషయాలు బయట పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడేవారని పోలీసులు తేల్చారు. అనంతరం అరెస్ట్‌లు, విచారణలు కొనసాగాయి. బెట్టింగ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ పాత్ర ఉందని తేలడంతో శ్రీని తప్పుకోవాలంటూ ఒత్తిడి పెరిగింది.
బోర్డులోని మరికొందరు సభ్యులు స్వయంగా రాజీనామాలు చేసి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. చివరకు తాత్కాలికంగా తప్పుకునేందుకు శ్రీనివాసన్ అంగీకరించడంతో దాల్మియా బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ వివాదంపై విచారణ గురించి బీసీసీఐ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అందులోనుంచి జగ్దలే తప్పుకోగా... మిగిలిన ఇద్దరు గురునాథ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. దీనిని చూపిస్తూ శ్రీనివాసన్ మళ్లీ బోర్డు బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
సుప్రీంకోర్టు ప్రవేశం...
అక్టోబరులో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ విశ్వసనీయతను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. దాంతో బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ దశలో శ్రీనివాసన్‌ను ఐపీఎల్‌కు సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఇతరత్రా అధ్యక్షుడిగా వ్యవహరించేందుకు అనుమతినివ్వడంతో పాటు మాజీ న్యాయమూర్తి ముద్గల్ నేతృత్వంలోని మరో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివిధ వర్గాలతో విచారించిన అనంతరం ముద్గల్ కమిటీ నివేదిక రూపొందించింది. గురునాథ్ నిబంధనలు ఉల్లంఘించాడని, అతనిపై ఆరోపణలు నిజమని తేల్చింది. క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించే అనేక తప్పుడు కార్యక్రమాలు జరిగాయని కూడా నివేదికలో పేర్కొంది. తన నివేదికలను సుప్రీంకోర్టుకు అందించింది. ఇందులో ఆరుగురు భారత క్రికెటర్ల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ ఈ అంశంపై ధోని కోర్టుకెక్కాడు.
గవాస్కర్‌కు పగ్గాలు...
ఈ ఏడాది మార్చి 25న ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీనివాసన్ వెంటనే తప్పుకోవాలని, అవసరమైతే చెన్నై, రాజస్థాన్ జట్లను కూడా తప్పించాలని సూచించింది. అయితే చివరకు ఆటగాళ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జట్లపై వేటు వేయలేదు. సుప్రీం ఆదేశాల మేరకు గవాస్కర్, శివలాల్ యాదవ్ తాత్కాలిక అధ్యక్షులుగా నియమితులయ్యారు.
మార్గం సుగమం...
చెన్నై, రాజస్థాన్ జట్ల విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించి ఉంటే ఆ రెండు జట్లను తప్పించాల్సి వచ్చేది. కెప్టెన్ ధోని సహా అనేక మంది స్టార్ ఆటగాళ్లు ఉన్న చెన్నైతో పాటు మాజీ చాంపియన్ రాజస్థాన్‌ను పక్కన పెడితే ఐపీఎల్ పూర్తిగా కళ తప్పేది. స్పాన్సర్లు, ఇతర ఆర్థికాంశాలను దృష్టిలో పెట్టుకుంటే అసలు ఆరు జట్లతో ఆడించడం అసాధ్యం. కాబట్టి ఈ రకంగా చూస్తే ఐపీఎల్ మైదానంలో తొలి గండాన్ని అధిగమించింది. ఇప్పటికీ వివాదాలు పూర్తిగా వీడకపోయినా... ఐపీఎల్ జరగనుండటం పెద్ద విశేషం. ఇక మిగిలింది ఆటగాళ్లు తమ సత్తా ప్రదర్శించడమే... ప్రేక్షకులను వినోదాన్ని పంచడమే.