సంజూ శాంసన్‌ ప్రపంచ రికార్డు

Samson Sets International Record With Maiden Double Hundred - Sakshi

అలూర్‌: భారత్‌ తరఫున కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడిన అనుభవం ఉన్న యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తనను మరొకసారి భారత జట్టులోకి తీసుకోవాలనే సంకేతాలు పంపుతూ డబుల్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) గుర్తింపు కల్గిన లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ద్విశతకంతో మెరిశాడు. ఫలితంగా ప్రపంచ రికార్డు సాధించాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా విజయ్‌ హజారే ట్రోఫీలో కేరళకు ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. గోవాతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ 129 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 212 పరుగులు చేశాడు. దాంతో తొలి డబుల్‌ సెంచరీ ని ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

ఇప్పటివరకూ ఈ రికార్డు పాకిస్తాన్‌కు చెందిన అబిద్‌ అలీ(209 నాటౌట్‌) పేరిట ఉండగా, దాన్ని సంజూ శాంసన్‌ బ్రేక్‌ చేశాడు. గతంలో పాకిస్తాన్‌ నేషనల్‌ వన్డే కప్‌లో భాగంగా ఇస్లామాబాద్‌ తరఫున ఆడిన సందర్భంలో పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో అబిద్‌ వికెట్‌ కీపర్‌గా అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఆ రికార్డును సంజూ శాంసన్‌ బద్ధలు కొట్టి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ డబుల్‌ సెంచరీకి తోడు సచిన్‌ బేబీ(127) సెంచరీ నమోదు చేశాడు. ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గోవా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్లానికి 273 పరుగులు చేసి ఓటమి పాలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top