
జొకోవిచ్ తో పోరును సాకేత్ మిస్సయ్యాడు!
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ భాగంగా మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం) జరిగిన పోరులో సాకేత్ 6-7(5), 6-4, 6-2, 2-6, 5-7 తేడాతో జిరి వెస్లే(చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలై టోర్నీనుంచి నిష్క్రమించాడు. మూడు గంటల 47 నిమిషాలపాటు సుదీర్ఘంగా జరిగిన మ్యాచ్లో సాకేత్ పోరాడి ఓడాడు. తొలి సెట్ను టై బ్రేక్లో కోల్పోయిన సాకేత్, రెండు, మూడు సెట్లను కైవసం చేసుకున్నాడు.
కాగా, ఆపై తిరిగి పుంజుకున్న వెస్లీ నాల్గో సెట్ ను దక్కించుకోవడంతో స్కోరు సమం అయ్యింది. దాంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఆ సెట్ ఆదిలో సాకేత్ 3-1, 4-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా, ఆపై అతని కుడి తొడ కండరాలు పట్టేశాయి. దాంతో చికిత్స కోసం కొంత సమయం తీసుకుని తిరిగి బరిలోకి వచ్చినా పూర్తిస్థాయిలో ఆడలేక ఓటమి పాలయ్యాడు.
రెండు రోజుల క్రితం యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు సాకేత్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. అయితే సాకేత్ తొలిరౌండ్లోనే ఓడిపోవడంతో టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్తో పోరును మిస్సయ్యాడు. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే రెండో రౌండ్లో జొకోవిచ్తో సాకేత్ తలపడేవాడు.