బ్యాంకాక్‌ వెళ్లారు...తొలి రౌండ్‌లో ఓడేందుకు!

Saina Nehwal And Kidambi Srikanth Knocked Out In First Round - Sakshi

నిరాశ పరిచిన సైనా, శ్రీకాంత్, సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ టోర్నీ  

బ్యాంకాక్‌: భారత అగ్రశ్రేణి షట్లర్లు సహా అందరూ థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ టోర్నీలో నిరాశపరిచారు. ఈ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, సమీర్‌ వర్మ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. దీంతో టోర్నీ మెయిన్‌ ‘డ్రా’ మొదలైన రోజే భారత్‌ కథ ముగిసింది. మెరుగైన ర్యాంకింగ్‌ ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఆ స్థాయి ఆటతీరేమీ పోటీల్లో కనబర్చలేదు. ఇలా వెళ్లారు... అలా ఓడారు... అన్నట్లు తమ మ్యాచ్‌ల్ని ముగించుకొని కోర్టుల నుంచి బయట పడ్డారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్, ఐదో సీడ్‌ సైనా 13–21, 21–17, 15–21తో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్‌ లైన్‌ హోజ్మార్క్‌ జార్స్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌) చేతిలో తొలిసారి ఓడిపోయింది. గతంలో జార్స్‌ఫెల్డ్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఒక్క రెండో గేమ్‌లో మాత్రమే చక్కగా ఆడగలిగింది.

మిగతా రెండు గేముల్లో చేతులెత్తేసింది. గతవారం జరిగిన ఇండోనేసియా మాస్టర్స్‌ ఈవెంట్‌లోనూ ఆమె తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత్‌ స్టార్‌ శ్రీకాంత్‌ 21–12, 14–21, 12–21తో షెసర్‌ హెరెన్‌ రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్లోనే చుక్కెదురవడం ఐదో సీడ్‌ తెలుగు షట్లర్‌కు వరుసగా ఇది మూడోసారి. మలేసియా, ఇండోనేసియా టోరీ్నల్లోనూ అతను మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. సమీర్‌ 16–21, 15–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ని్రష్కమించాడు. ప్రణయ్‌ 17–21, 22–20, 19–21తో ల్యూ డారెన్‌ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ఒక దేశం నుంచి ఇద్దరు షట్లర్లు అర్హత పొందాలంటే ఒలింపిక్‌ ర్యాంకింగ్స్‌లో ఆ ఇద్దరు టాప్‌–16లో ఉండాలి. ప్రస్తుతం భారత్‌ నుంచి మహిళల సింగిల్స్‌లో సింధు... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ మాత్రమే ‘టోక్యో’ దారిలో ఉన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top