విరాట్‌ వర్సెస్‌ రోహిత్‌!

rohit sharma joins kohli after 6th odi century in 2017 - Sakshi

మొహాలి: విరాట్‌ కోహ్లి.. భారత్‌ క్రికెట్‌ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ కాగా, రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యహరిస్తున్నాడు. విరాట్‌ కోహ్లి గైర్హాజరీతో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. తాజాగా శ్రీలంకతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర ఆట తీరుతో డబుల్‌ సెంచరీ సాధించాడు. తద్వారా వన్డే క్రికెట్‌ చరిత్రలో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా  రికార్డు సృష్టించాడు. మరొకవైపు భారత్‌ తరపున కెప్టెన్‌గా డబుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్‌ కెప్టెన్‌గా ఉండగా డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఆ తరువాత వన్డేల్లో కెప్టెన్‌గా ద్విశతకం సాధించిన తొలి భారత ఆటగాడు రోహిత్‌ శర్మనే.ఇప్పుడు రోహిత్‌ శర్మను మరొక రికార్డు ఊరిస్తోంది. అది కూడా భారత్‌ తరపున ఈ ఏడాది అత్యధిక వన్డే సెంచరీలను సాధించే రికార్డు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లి-రోహిత్‌ శర్మల మధ్య ఆరోగ్యకర పోరు నెలకొంది. శ్రీలంకతో రెండో వన్డేలో రోహిత్‌ శర్మ.. విరాట్‌ కోహ్లి ఈ ఏడాది సాధించిన సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈ ఏడాది విరాట్‌ కోహ్లి ఆరు వన్డే సెంచరీలను తన ఖాతాలో వేసుకోగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ నిలిచాడు. ఈ క్రమంలోనే కోహ్లి రికార్డును అధిగమించేందుకు చేరవగా వచ్చాడు. ఇంకా లంకేయులతో వన్డే మ్యాచ్‌ మిగిలి ఉండటంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలవడానికి రోహిత్‌కు ఇదొక సువర్ణావకాశం. ఈ సిరీస్‌లో కోహ్లి కూడా లేకపోవడంతో రోహిత్‌ శర్మను ఆ రికార్డు ఊరిస్తోంది.

ఒకవేళ తదుపరి వన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీ సాధిస్తే.. భారత్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ల సరసన నిలుస్తాడు. 2000వ సంవత్సరంలో గంగూలీ ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఏడు సెంచరీలు సాధిస్తే.. గతేడాది(2016) డేవిడ్‌ వార్నర్‌ ఏడు వన్డే సెంచరీలను నమోదు చేశాడు. కాగా, ఒక క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన రికార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. 1998లో సచిన్‌ టెండూల్కర్‌ తొమ్మిది వన్డే సెంచరీలను నమోదు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆపై డేవిడ్‌ వార్నర్‌, గంగూలీలు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top