కోహ్లి వస్తే.. అయ్యర్ మాటేంటి!

Rohit Sharma supports to New player Shreyas Iyer - Sakshi

సాక్షి, విశాఖపట్నం: శ్రీలంకతో వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలం కాగా, రెండో వన్డేలో బ్యాటింగ్‌లో విజృంభించిన జట్టు భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. రెండు వన్డేల అనంతరం ఇరుజట్లు 1-1తో నిలవగా, సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మూడో వన్డే ఇక్కడి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. బ్యాటింగ్‌లో ఆటగాళ్లు రాణించేందుకే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారని రోహిత్ అంటున్నాడు. అయితే కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ నైపుణ్యంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. కానీ రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి వస్తే అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ మారుతోంది. కోహ్లి మూడో స్థానం (ఫస్డ్ డౌన్‌)లో బ్యాటింగ్‌కు వస్తాడు కనుక అయ్యర్ సెకండ్ డౌన్‌లో క్రీజులోకి రావాల్సి ఉంటుంది. అయితే విశాఖ వన్డేలో అయ్యర్ రాణించడంపై అతడికి అవకాశాలు ఇవ్వాలా లేదా అన్నది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డాడు రోహిత్.

'తొలి వన్డేలో జట్టు పరుగుల ఖాతా తెరకముందే ధావన్ ఔట్ అయిన సమయంలో క్రీజులోకొచ్చిన అయ్యర్ పై కొంత ఒత్తిడి ఉన్నది. అందులోనూ నేను రెండు పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టడంతో అయ్యర్‌ మరింత ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఇతర ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఒత్తిడిలో అయ్యర్ బౌల్డ్ అయ్యాడు. రెండో వన్డేలో ఓపెనర్ల సెంచరీ భాగస్వామ్యం తర్వాత తొలి వికెట్ పడ్డాక బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్ స్వేచ్ఛగా పరుగులు సాధించాడు. పిచ్‌ పరిస్థితుల్ని చక్కగా ఆకలింపు చేసుకుని 70 బంతుల్లోనే 88 పరుగులు చేసి రాణించాడు. నేటి వన్డేలో రాణించి జట్టులో అతడు స్థానం సుస్థిరం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవాలంటే కొన్ని సిరీస్‌లు వరుసగా ఆడే అవకాశం ఇవ్వాలని' రోహిత్ అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top