మూడేళ్లలో 217 సిక్సర్లు.. అందుకే అలా అనేది! | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో 217 సిక్సర్లు.. అందుకే కదా అలా అనేది!

Published Thu, Apr 30 2020 6:51 PM

Rohit Sharma Birthday: A Special Story On His Sixes Records - Sakshi

దూకుడులో వీరేంద్ర సెహ్వాగ్‌ వారసత్వం.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో యువ ఆటగాళ్లకు స్పూర్తి కలిగిస్తాడు.. సిక్సర్ల సునామీ సృష్టించడంలో అతడికి అతడే సాటి.. బ్యాట్స్‌మన్‌గా ముందుండి నడిపిస్తాడు.. అవకాశం వచ్చిన ప్రతీసారి సారథిగా వెనకుండి ప్రోత్సహిస్తాడు అతడే టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ. ఈ రోజు(ఏప్రిల్‌ 30)న 33వ జన్మదిన వేడుకులు జరుపుకుంటున్న రోహిత్‌కు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అతడి గురించి తెలుసుకోవాలని అనేకమంది నెటిజన్లు గూగుల్‌ బాట పట్టారు. ఈ క్రమంలో రోహిత్‌ను హిట్‌ మ్యాన్‌ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుంటున్నారు

ఈ రికార్డులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇప్పటివరకు 364 అంతర్జాతీయ మ్యాచ్‌లు(అన్ని ఫార్మట్లు కలిపి) ఆడిన రోహిత్‌ 14,029 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా 423 సిక్సర్లతో టాప్‌-3లో ఉన్నాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో క్రిస్‌ గేల్‌(534), షాహిద్‌ ఆఫ్రిది(476)లు ఉన్నారు. ఇక గత మూడేళ్లలో రోహిత్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో మెస్మరైజ్‌ చేసిన రోహిత్‌ గడిచిన ఈ మూడేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 217 సిక్సర్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2017లో 65, 2018లో 74, 2019లో 78 సిక్సర్లు సాధించాడు.

ఇక టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారమెత్తి దక్షిణాఫ్రికాపై శివతాండవం చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన టెస్టులో​ ఏకంగా 13 సిక్సర్లు సాధించడంతో ఓ టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్‌ నిలిచాడు. అంతేకాకుండా ఆ టెస్టు సిరీస్‌లో అత్యధిక(20) సిక్సర్లు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ మరో రికార్డును నెలకొల్పాడు. కేవలం టెస్టుల్లోనే కాదు వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా మరెన్నో రికార్డులు రోహిత్‌ పేరిటే ఉన్నాయి. అందుకే అతడిని సెహ్వాగ్‌ స్క్వేర్‌, సిక్సర్ల కింగ్‌, హిట్‌మ్యాన్‌ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. 

రోహిత్‌ శర్మ పేరిట ఉన్న కొన్ని రికార్డులు..
► ఇంగ్లండ్‌ గడ్డపై హ్యాట్రిక్‌ శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ దీన్ని సాధించాడు. 
► వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్‌(264)ది. 
► వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌
► ఒక వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు(5) చేసిన ఆటగాడు రోహిత్‌
► ఒక వన్డే వరల్డ్‌కప్‌లో ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు(3) ఘనత కూడా రోహిత్‌దే.
► 2019లో 10 శతకాలు బాదాడు. అయితే ఓ క్యాలెండర్ ఏడాదిలో 7 జట్లపై శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు.
► అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఆటగాడు రోహిత్ శర్మ

చదవండి:
హిట్‌మ్యాన్‌కు స్పెషల్‌ డే..!
‘గాడ్‌ బ్లెస్‌ యూ హిట్‌మ్యాన్‌‌’

Advertisement

తప్పక చదవండి

Advertisement