పూర్తిస్థాయి కెప్టెన్సీకి సిద్ధం : రోహిత్‌ | Rohit Says I Will Be Ready For Captaincy | Sakshi
Sakshi News home page

Sep 29 2018 8:24 PM | Updated on Sep 30 2018 2:48 PM

Rohit Says I Will Be Ready For Captaincy - Sakshi

ధోనికి కెప్టెన్‌గా ఏ లక్షణాలు అయితే ఉన్నాయో.. అవన్నీ నాలో కూడా ఉన్నాయి..

దుబాయ్‌: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా ఆసియాకప్‌ టైటిల్‌ అందించిన రోహిత్‌ శర్మ పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో భారత్‌ మూడు వికెట్లతో నెగ్గి ఏడోసారి టైటిల్‌ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రోహిత్‌ శర్మ కెప్టెన్సీని కొనియాడుతున్నారు. అయితే మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. తన కెప్టెన్సీ అచ్చు ధోనిలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

‘ధోనికి కెప్టెన్‌గా ఏ లక్షణాలు అయితే ఉన్నాయో.. అవన్నీ నాలో కూడా ఉన్నాయి. మైదానంలో ఎలా మెలగాలో ధోనీ నుంచే నేర్చుకున్నా. ఒత్తిడి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పింది ఆయనే. ధోనితో కలిసి ఆడిన ప్రతిసారి ఆయన మైదానంలో ఎలా మెలుగుతున్నారో బాగా గమనించేవాడిని. ఇప్పటికీ అదే పని చేస్తున్నా. నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపే చాకచక్యం నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అతని కెప్టెన్సీలో మేం ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. మేం ఎప్పుడు ధోనిబాయ్‌ నుంచి ఎదో ఒకటి నేర్చుకుంటాం. ఎందుకంటే అతనో గొప్ప కెప్టెన్‌. ఏమైన సందేహాలు, ప్రశ్నలు ఉంటే వాటికి అతనెప్పుడు సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉంటాడు.’ అని తెలిపాడు.

ఇక రోహిత్‌ కెప్టెన్సీ రికార్డు అద్బుతంగా ఉంది. అతని సారథ్యంలో భారత్‌ నిదహాస్‌ ట్రోఫీ, ఆసియాకప్‌ గెలిచింది. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ మూడు సార్లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్దమేనా అని అడిగిన ప్రశ్నకు రోహిత్‌ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ‘మాకు కేవలం గెలుపే కావాలి. కెప్టెన్సీ అవకాశం వస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాను.’  అని తెలిపాడు. ఇక నెం 4, నెం6 స్థానాల్లో ఎవరు కుదురుకోలేదని రోహిత్‌ అంగీకరించాడు. ‘ప్రపంచకప్‌ టోర్నీ సమీపిస్తుండటంతో నాలుగు, ఆరు స్థానాల ఎంపిక కోసం ఇంకొన్ని మ్యాచ్‌లు అవసరం. ప్రస్తుతం అయితే ఇది సరైన సమయం కాదు. ప్రపంచకప్‌ వరకు మాకు స్పష్టత వస్తోంది. జరగబోయే టోర్నీలు మాకు అనుకూలమైనవే. ఏ ఆటగాళ్లను ఆడించాలి అనేది మేనేజ్‌ మెంట్‌ చూసుకుంటుంది’ అని తెలిపాడు. యువజట్టుగా ఈ టైటిల్‌ను గెలవడం సంతోషాన్నించిందని చెప్పుకొచ్చాడు. భారత స్పిన్నర్లు స్థిరంగా రాణించారని కొనియాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement